
పేదలందరికీ పక్కా ఇళ్లు:వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ.. ఐదేళ్లలో 50 లక్షల గృహాలు
- 2019 నాటికి గుడిసె లేని రాష్ట్రం
- అధికారంలోకి రాగానే సంతకం ఆఫైలు పైనే
- రోశయ్య, కిరణ్‌ల హయాంలో ఇందిరమ్మ నిర్వీర్యం
- యువనేత హామీతో బడుగులకు భరోసా
మండపేట, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ హయాంలో పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు పేదవర్గాల వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. అర్హులైన వారందరికీ కాకుండా అరకొరగానే ఇళ్లు మంజూరు ఉండేది. వాటిని తెలుగు తమ్ముళ్లు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టడంతో పేదవర్గాల వారి సొంతింటి కల కల్లగానే మిగిలేది. కాని రాజశేఖరరెడ్డి ఎప్పుడూ పేదల గురించే ఆలోచన చేసేవారు. ప్రతి పేదవాడు పక్కా ఇంటిలో ఉండాలని కలలు కనేవారు. అందులోంచి పుట్టుకు వచ్చిందే ఇందిరమ్మ పథకం. 2006 ఏప్రిల్ 1వ తేదీన జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రిక నుంచే ఈ పథకాన్ని ప్రారంభించారు వైఎస్. మూడు విడతలుగా అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. స్థలాలు లేని వారి కోసం వేలాది ఎకరాలు సేకరించి ఇళ్ల నిర్మాణానికి పాటుపడ్డారు. టీడీపీ హయాంలో రూరల్‌లో రూ. 30,000, అర్బన్‌లో రూ. 40,000లు ఉన్న రుణసాయాన్ని ఆయన రూరల్‌లో రూ. 45,000కు, అర్బన్‌లో రూ.55,000కు పెంచారు. వైఎస్ హయాంలో దేశవ్యాప్తంగా సుమారు 47 లక్షల ఇళ్లు నిర్మిస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు నిర్మించారు.
ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే దాదాపు 2.5 లక్షల ఇళ్లను వైఎస్ మంజూరు చేశారు. ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఇందిరమ్మ పథకానికి పూర్తిగా తూట్లు పొడిచాయి. గడిచిన మూడు రచ్చబండ కార్యక్రమాల్లో సుమారు 1.10 లక్షల మంది కొత్త ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా కొద్దిమందికే మంజూరు చేయగలిగారు. బిల్లుల విడుదలలో జాప్యం కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పేదల కోసం సేకరించిన వేలాది ఎకరాల ఇళ్ల స్థలాలు మెరక పనులకు నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. పేదలకిచ్చే రుణసాయం పెంచినట్టు గొప్పలు పోయిన కిరణ్ సర్కార్ పరిపాలన ఖర్చులు, కంట్రిబ్యూషన్, తదితరాల రూపంలో లబ్ధిదారులకు ఇచ్చేసాయంలో భారీగా కోత విధించి విమర్శల పాలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పూర్తిస్థాయిలో పేదలకు పక్కా ఇళ్లు దక్కుతాయని పలువురు అంటున్నారు. తండ్రిబాటలోనే తనయుడు ఆలోచనలు చేస్తున్న తీరును పేదవర్గాల వారు అభినందిస్తున్నారు. రాజన్నరాజ్యం రావాలని జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు.
జననేత వస్తే కష్టాలు తీరినట్టే
2019 నాటికి రాష్ట్రాన్ని గుడిసేలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ధృడసంకల్పంతో ఉన్నారు వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫైలుపైనే సంతకం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి పక్కా ఇల్లు అందించేందుకు ఏటా పది లక్షలు చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తానని ఆయన మాటిస్తున్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్లు పొందిన పేదవర్గాల వారికి వాటిపై యాజమాన్యపు హక్కు లేదు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు శ్రీకారం చుట్టనున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్ సీపీ హయాంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేసే ఇళ్లపై ఆ ఇంటి మహిళకు యాజమాన్యపు హక్కును కల్పించనున్నారు. ఇంటి పత్రాలను వారికే అందించనున్నారు.
గతంలో వలె పక్కా ఇంటి నిర్మాణానికి మార్జిన్ మనీ, రుణం భారం వంటివి లేకుండా ప్రభుత్వమే ఇళ్లు కటించి, పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల సొంతింటి కోసం లబ్ధిదారులు రుణగ్రస్తులు కావాల్సిన అవసరం ఉండదు.స్వయం ఉపాధి కోసం ఆ ఇల్లే గ్యారంటీగా పెట్టుకుని పావలా వడ్డీకే రూ. 30 వేలు వరకు బ్యాంకుల నుంచి రుణసాయం పొందే వెసులుబాటు కల్పించనున్నారు. దీనివల్ల అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి తొలగనుంది.