వేకువకు ముందు వేగు చుక్కాల్లా
మలమలమాడ్చే ఎండలో కేవలం నాలుగు నిమిషాలు నిలబడ్డ వారైనా.. నీడ కోసం తపిస్తారు. మరి.. నాలుగున్నరేళ్లుగా ‘కాల్చుకు తింటున్న’ పాలనతో విలవిలలాడుతున్న ప్రజలు..మాటకు కట్టుబడే నిబద్ధుల చెంతకు; కష్టాల నుంచి గట్టెక్కించే సమర్థుల చెంతకు..పల్లానికి నీరులా ఉరికితే ఆశ్చర్యమేముంది? జననేత జగన్, ఆయన సోదరి షర్మిల పాల్గొన్న ‘వైఎస్సార్ జనభేరి’ సభలు దిగ్విజయం కావడంతో వింతేముంది? వారి రాకతో వైఎస్సార్ సీపీ శ్రేణులసమరోత్సాహం పదింతలు, మంచిరోజులు తథ్యమన్న ప్రజల నమ్మకం వందరెట్లు అయ్యాయి.
సాక్షి, కాకినాడ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్దుబిడ్డలైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల జిల్లాలో కోనసీమ, మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల సమరోత్సాహం ద్విగుణీకృతమైంది. ప్రచారం ముగింపు దశలో వారి పర్యటన పార్టీ గెలుపును మరింత నల్లేరుపై నడక చేసిందన్న నమ్మకం నాయకులు, కార్యకర్తల్లో తొణికిసలాడుతోంది. జగన్ సుడిగాలి పర్యటనలో భాగంగా శనివారం పి.గన్నవరంలో వైఎస్సార్ జనభేరిలో పాల్గొని తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరించి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించి వెళ్లారు.
శనివారమే జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేశారు. టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు, మోడీల కుట్రలు కుత్రంతాలపై నిప్పులు చెరుగుతూనే నటుడు పవన్‌కల్యాణ్ తిక్కను తనదైన శైలిలో తూర్పారబట్టారు. అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరంలో సాగిన షర్మిల పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రత్యర్థులపై ఆమె సంధించిన వాగ్బాణాలకు ప్రజల నుంచి అనూహ్యస్పందన వచ్చింది.
ప్రత్యర్థులపై షర్మిల మాటల ఈటెలు
షర్మిల కోనసీమలోని రాజోలు నియోజకవర్గంలో శనివారం ప్రారంభించిన ప్రచారం ఆదివారం కాకినాడ రూరల్ మండలం కరపతో ముగిసింది. మలికిపురం, కొత్తపేట, కోరుకొండ, రంపచోడవరం, కరపలలో జనభేరి సభలలో పాల్గొన్న షర్మిల కుట్ర, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబు తీరును ఎండగట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో నిర్లక్ష్యం చేసిన వ్యవసాయం, విద్య, విద్యుత్ తదితర రంగాలను ఇప్పుడు ఉద్ధరిస్తానంటూ చెబుతున్న మాయమాటలు, సొల్లు కబుర్లు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని.. ఎత్తిచూపినప్పుడు జనం హోరెత్తారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక్కడినే ఎదుర్కొనలేక మహాకూటమి పెట్టిన చంద్రబాబును కాదని ప్రజలు మహానేతకు పట్టం గట్టిన విషయాన్ని గుర్తు చేసినప్పుడు జేజేలు పలికారు.
ఇప్పుడు జగనన్నను ఒక్కడినే ఎదుర్కొనే దమ్ము లేక మోడీ, పవన్‌కళ్యాణ్‌లతో జత కట్టారని, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మొగుడూ పెళ్లాల్లా.. ఒకరి గురించి ఒకరు గొప్ప చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసినప్పుడు జనం కేరింతలు కొట్టారు. చంద్రబాబు నుంచి మోడీ, చిరంజీవి, పవన్, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా నేతలను కడిగి పారేసిన షర్మిల మాటలకు జనం విశేషంగా స్పందించారు. కోరుకొండ సభలో మాట్లాడుతూ.. ఈ జిల్లా ప్రజలు తమ కుటుంబానికి ప్రతి కష్టంలో అండగా ఉన్నారని, దివంగత నేత జక్కంపూడి, వైఎస్‌ల అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు జక్కంపూడి, వైఎస్‌లకు జోహార్లతో సభాస్థలి మార్మోగింది. జనభేరి సభలలో షర్మిల ప్రసంగం జిల్లాలో అన్ని వర్గాల ప్రజల మనస్సులను హత్తుకుంది. షర్మిల రంపచోడవరంలో విల్లును ఎక్కుపెట్టి, మహానేత గిరిజనులకు భూములపై హక్కు కల్పించిన విషయాన్ని గుర్తు చేసినప్పుడు గిరిపుత్రుల్లో ఆనందం వెల్లివిరిసింది.
రంపచోడవరంలో గిరి‘జనఝరి’
మలికిపురం మొదలు కరప వరకు ఒకదాని మించి మరొకటి అన్నట్టు జనం ఉత్తుంగ తరంగాల్లో జనభేరి సభలకు పోటెత్తారు. మండేఎండను సైతం లెక్కచేయకుండా పిల్లా పాపలతో గంటల తరబడి నిరీక్షించి, షర్మిలను చూసి, ఆమె పలుకులు ఆలకించి మంత్రముగ్ధులయ్యారు. రంపచోడవరంలో శనివారం జరిగిన చంద్రబాబు పర్యటనకు ముఖం చాటేసిన గిరిబిడ్డలు.. ఆదివారం షర్మిల జనభేరికి వెల్లువెత్తారు. లోతట్టుప్రాంతాల నుంచి ఉదయాన్నే తరలిరావడంతో డివిజన్ కేంద్రమైన రంపచోడవరం వెళ్లే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. ప్రచారపర్వం చివరి దశలో అన్నాచెల్లెళ్లు జిల్లాలో నిర్వహించిన ఆరు జనభేరి సభలు దిగ్విజయం కావడం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత చిరంజీవి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నాయకులు జిల్లాలో నిర్వహించిన ప్రచారాలు పేలవంగా సాగడం ఆ పార్టీలపై జిల్లావాసులకున్న వ్యతిరేకతకు అద్దం పట్టింది.