పోలీసు అటెన్షన్...
సాక్షి, సిటీబ్యూరో: పోలింగ్ కేంద్రాల వద్ద జంట కమిషనరేట్ల పోలీసులు అటెన్షనయ్యారు. అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 379 పోలింగ్ కేంద్రాల పరిధిలో మంగళవారం కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం ఉందనే నమ్మకాన్ని ఓటర్లలో కలిగించారు. పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లను కమిషనర్లు అనురాగ్‌శర్మ, సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే క్షణాల్లో బలగాలు అక్కడికి చేరుకొనేలా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో పెట్రోలింగ్, ఫ్లైయింగ్‌స్వ్కాడ్, స్ట్రైకింగ్‌ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీంల పనితీరును అర్ధరాత్రి వరకు వారు పరిశీలించారు. ఈవీఎంలను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించారు. ఉద్రిక్తతలు తలెత్తిన నాంపల్లి, ఖైరతాబాద్ నియోజక వర్గాలపై నగర కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.
నిఘా వర్గాల ద్వారా అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ రూం సిబ్బంది తమకు అందే ఫిర్యాదులను వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క పోలింగ్ రోజున ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఆయా ప్రాంతాల్లో పోలింగ్ బందోబస్తును పర్యవేక్షించేందుకు ఇన్‌చార్జీలను నియమించారు.