కిష్టప్ప ఎంపీ అయితే ప్రమాదమే..
సాక్షి, హైదరాబాద్: నేరమని తెలిసీ డబ్బు కోసం మనుషుల అక్రమ రవాణాకు సహకరిస్తానంటూ నేరగాళ్లతో ఒప్పందం చేసుకున్న మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉండడంపై పోలీసు, నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఆ పార్టీ టికెట్టు ఇవ్వడం పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
2007లో వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేసిన మనుషుల అక్రమ రవాణా కుంభకోణంలో ప్రధాన నిందితుడు రషీద్ అలీ తనకు నిమ్మల కిష్టప్పతో ఉన్న సాన్నిహిత్యాన్ని రాష్ట్ర నేరపరిశోధన విభాగం అధికారుల వద్ద బయటపెట్టాడు. అతడిచ్చిన వాంగ్మూలంలో పలువురు వీఐపీలతో పాటు కిష్టప్పతో తాను చేసిన లావాదేవీల గుట్టువిప్పాడు. కిష్టప్ప లాంటి వాళ్లు పార్లమెంట్‌లో అడుగుపెట్టినా.. ముష్కరులతో పాటు అలాంటి వారిపైనా నిఘా పెట్టాల్సి వస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
మాజీ మంత్రిగా ఉన్నపుడే నేరగాళ్లకు సహకరించడానికి అంగీకరించిన కిష్టప్ప.. రేపు కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ప్రభుత్వం వస్తే పలు స్కామ్‌లకు తెరతీసే ప్రమాదం ఉంటుందని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్‌పై ఉన్న రషీద్‌తో పాటు మరికొంత మంది నిందితులు నిమ్మల కిష్టప్ప వంటి వారి సహకారంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
అప్పట్లో సంచలనం సృష్టించిన కుంభకోణం..
నకిలీ పాస్‌పోర్టులు, వీసాల స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో ఢిల్లీలో మొదలైన దీని ప్రకంపనకు హైదరాబాద్‌నూ తాకాయి. అక్రమ వలసల కారణంగా అమెరికా వంటి దేశాలు భారతీయులకు గతంలో వీసాలు జారీ చేయడం నిలిపేశాయి. దీంతో రాజకీయ ప్రముఖుల సిఫార్సు లేఖలతో నకిలీ పాస్‌పోర్టులు, వీసాల కుంభకోణానికి బీజం పడింది.
ఈ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాశిపేట లింగయ్య, సోయం బాపూరావు తదితరులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పాస్‌పోర్ట్ బ్రోకర్ రషీద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముజఫర్ అలీ ఖాన్ తదితరులు నిందితులుగా ఉన్నారు. కాగా, ప్రధాన నిందితుడు రషీద్ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి తన స్నేహితుడు ప్రకాష్‌రెడ్డి ద్వారా కొందరు రాజకీయ ప్రముఖులతో పాటు నిమ్మల కిష్టప్పను కలిశానని సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
నలుగురు గుజరాతీయులకు వీసాల కోసం సహకరిస్తే రూ. 20 లక్షలు ఇస్తానంటూ నిమ్మల కిష్టప్పతో బేరం కుదుర్చుకున్నానని వెల్లడించాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగా హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసులు తనతో పాటు ప్రకాష్‌రెడ్డినీ అరెస్టు చేయడంతో పథకం పారలేదని రషీద్ చెప్పాడు. అప్పట్లో పోలీసులు తమ నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టుల్లో నిమ్మల కిష్టప్పది కూడా ఉందని, ఆ తరవాత అది ఆయనకు చేరిందని వివరించాడు.