ఈనెల 16న ప్రారంభం కానున్న టీ 20 క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్.. రాజకీయాలనూ వేడెక్కిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడానికి కారణం మీరంటే.. మీరంటూ కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గత సంవత్సరం ఐపీఎల్ సందర్భంగా ధర్మశాల స్టేడియంలో 9 మ్యాచ్‌లను నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆ మ్యాచ్‌లు ధర్మశాలలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆయన ఇప్పుడు హమీర్‌పూర్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐకి హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ అనుమతినివ్వకపోవడం వల్ల రాష్ట్రం రూ. 500 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఠాకూర్ చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం ఠాకూర్ వల్లే ఇలా జరిగిందని విమర్శిస్తోంది.