పోలింగ్ విశేషాలు-విషాదాలు
హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా అనేక చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. కొన్ని విశేషాలు, విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో శాసనసభ, లోక్‌సభ ఈవీఎంలు తారుమారయ్యాయి. కలశపాడు మండలం చింతలపల్లెలో అసెంబ్లీ, లోక్‌సభ ఈవీఎంలను అటుది ఇటు, ఇటుది అటు పెట్టారు. ఉదయం నుంచి అలాగే ఓటర్లు ఓట్లు వేశారు. ఇప్పటివరకు 269 పోలయ్యాయి. అప్పటికి గానీ పోలింగ్ అధికారులు తమ పొరపాటును గుర్తించలేదు. ఆ తరువాత ఈవీఎంలను యథాస్థానాలలో ఉంచి ఓట్లు వేయిస్తున్నారు. మళ్లీ అందరితో ఓట్లు వేయిస్తామని అధికారులు చెబుతున్నారు.
* ప్రకాశం జిల్లా నికరంపల్లి పోలింగ్ కేంద్రం 2లో ఈవిఎంలు తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయి. 5 ఓట్లు వేస్తే 15 ఓట్లుగా చూపించాయి. దాంతో సిబ్బంది పోలింగ్ నిలిపివేశారు.
*విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం బుద్రాయవలసలో పోలింగ్ కేంద్రం 19లో ఏ గుర్తుకు ఓటేసినా కాంగ్రెస్కే పడుతుందని ఓటర్లు ఆందోళన చేస్తున్నారు.
* విశాఖపట్నం ఏయూ హైస్కూల్ పోలింగ్ కేంద్రం 145కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. ఆ బెదిరింపు ఆకతాయిల పనేనని అధికారులు తేల్చారు.
* గుంటూరు జిల్లా మాచర్లలో ఆర్సిఎం స్కూలులోని పోలింగ్ కేంద్రంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఓటేసేందుకు ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడంలేదు.
* కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గొల్లవరం గ్రామస్తులు 20ఏళ్ల తర్వాత ఓటింగ్‌లో పాల్గొన్నారు.
* ఎప్పటిమాదిరిగానే అనేక చోట్ల ఈవిఎంలు పనిచేయలేదు. వాటిని సరిచేసేవరకు పోలింగ్ను నిలిపివేశారు.
* తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ముల్లేరు పోలింగ్ కేంద్రంలోని ఈవిఎంలో ఫ్యాన్ గుర్తు బటన్ పనిచేయలేదు.
* కర్నూలు జిల్లా నంద్యాలలోని పోలింగ్ కేంద్రం 83లో విద్యుత్ లేక పోలింగ్ను నిలిపివేశారు.
*కర్నూలు జిల్లా వెల్దుర్తి కృష్ణాపురంలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ సిబ్బంది అబ్దుల్ నబీ గుండె పోటుతో మృతి చెందారు.
* తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని 3 గ్రామాలలోని ఓటర్లు అభ్యర్థులు తమకు డబ్బు పంచలేదని పోలింగ్‌ను బహిష్కరించారు.
* గుంటూరు జిల్లా మాచర్ల జెడ్పీ హైస్కూల్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆందోళనకు గురైంది. స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
* గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల ఘర్షణ జరిగింది. అందోళనకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్ సిపి ఏజెంట్లను కిడ్నాప్ చేశారు.
* తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్న గల్లా అరుణకుమారికి చెందిన అమర్‌రాజా ఫ్యాక్టరీ సిబ్బిందిపై పేరూరు గ్రామస్తులు దాడి చేశారు.
* చిత్తూరు జిల్లా తిరుచానూరు,పుత్తూరు, పలమనేరులలో భారీ వర్షాన్ని సైతం సైతం లెక్కచేయకుండా ఓటర్లు బారులు తీరారు.
* వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలం కేఎన్‌గుడిలో పాస్ పుస్తకాలు ఇవ్వలేదని గ్రామస్తులు
ఓటింగ్‌ను బహిష్కరించారు. ఓబులవారిపాలెం మండలం బీపీరాజుపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సిపి ఏజెంట్ మోహన్‌నాయక్‌ను టిడిపి నేతలు కిడ్నాప్ చేశారు.
* పశ్చిమగోదావరి జిల్లా వేగవరంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈవీఎంలో నుంచి పొగలు వచ్చాయి.
* అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గరుడ స్టీల్ ఫ్యాకర్టీకి సెలవు ప్రకటించలేదు. ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు.
తాడిపత్రి గణేషనగర్ పోలింగ్ బూత్‌లో ఓటేసి వెనుదిరుగుతూ మెట్లపై నుంచి జారిపడి వృద్ధురాలు సుబ్బమ్మ మృతి చెందారు.
* పశ్చిమగోదావరి కొయ్యలగూడెం మండలం గిరిజన గ్రామాల్లో కిష్టప్పగూడెం, వంకబొత్సగూడెం, తంగెళ్లగూడెం, మర్రిగూడెం గ్రామాలలో ఓటర్లు ఓటింగ్ బహిష్కరించారు.
* సత్తెనపల్లి మండలం కట్టమూరులో టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు.
* గుంటూరు జిల్లా రేపల్లెలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న కరీంనగర్‌కు చెందిన కానిస్టేబుల్ వైకుంఠం ఆకస్మికంగా మృతి చెందారు.