అన్నమో రామచంద్రా!
అన్నమో రామచంద్రా!
Published Sun, Apr 6 2014 3:46 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: మండలంలో పోలింగ్ విధు లు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది ఆకలితో అల మటించారు. ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విదులు నిర్వహించేందుకు పలువురు పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు శనివారం ఉదయం 9గంటలకే మండల కేంద్రానికి చేరుకున్నారు. సిబ్బందికి పోలింగ్ సామగ్రితో పాటు ఆహార పొట్లాలు అందజేయాల్సి ఉంది. కానీ రూట్ల వారీగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఆహార పొట్లాలు సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో సిబ్బంది 12 గంటల కల్లా బస్సుల్లో కూర్చున్నారు. మధ్యాహ్నం 2 గంటలైనా పలువురి ఆహార పొట్లాలు అందలేదు. ఒకటో నంబరు రూట్ బస్సులో ఉన్న సుమారు 50 మంది ఆకలితో అలమటించారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి 2.30 గంట లకు పొట్లాలు అందజేశారు. సకాలంలో భోజనం సరఫరా చేయలేదని ఒక టో నంబరు రూట్‌లోని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేం దుకు వెళుతున్న సీహెచ్ భాస్కరరావు, సి.సూర్యారావు, ఎ.దామోదరరావు, రమణమూర్తి తెలిపారు.
కమిషన్ల కక్కుర్తే కారణం
కమిషన్లకు కొంతమంది సిబ్బంది కక్కుర్తి పడడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వచ్చాయి. మండల కేంద్రంలో మూడు హోట ళ్లు ఉన్నాయి. కానీ ఒకే హోటల్‌కు భోజనాలు సరఫరా చేసేందుకు మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే సిబ్బంది ఒప్పందం కుదుర్చుకున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని, అప్పుడు నాసిరకం బిర్యానీ సరఫరా చేశారని, ఇప్పుడు ఆలస్యంగా భోజనాలు అందించారని పోలింగ్ సిబ్బంది చెప్పారు.
ప‘లావు’గా లేదు..
పలాస రూరల్ : పలాస జూనియర్ కళాశాల ఆవరణలో శని వారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సిబ్బందితో పాటు ఎన్నికలు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు ఆకలితో అలమటించారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ సమక్షంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ చేసిన 30 మంది ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు టెంట్‌లో కూర్చున్నారు. వారికి ఉదయం ఇడ్లీ పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేసేందుకు కౌంటర్ వద్దకు వెళితే పలావు ప్యాకెట్లు ఇచ్చా రు. అదికూడా తమకు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని సిబ్బం ది ఆరోపించారు. భోజనం పెట్టాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నా మండల పరిషత్ అధికారులు పట్టించుకోవడం లేదు. భోజనం పెట్టలేదని అధికారుల దష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఎన్నికల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం పెట్టకుండా పలావు ఇవ్వడంతో తాము ఆకలితో అలమటించామని ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీనిపై పలాస ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.రామారావును ‘న్యూస్‌లైన్’ ఫోన్‌లో ప్రశ్నించగా, సమాధానం చెప్పలేదు.
బిర్యానీతో సరి...
కొత్తూరు: నాణ్యత లేదు.. చాలీచాలని బిర్యాని పెట్టారని ఆర్‌వో వెంకటరావుకు పోలింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. మండల పరిషత్ కార్యాలయానికి శనివారం పోలింగ్ సిబ్బంది వచ్చారు. ఎన్నికల విధులకు సుమారు 400 మందిని నియమించారు. రూట్ నంబరు 3, రూట్ నంబరు 1లో కొందరికి సకాలంలో బిర్యానీ అందలేదు. చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మండల పరిషత్ కార్యాలయ అధికారులు ఎన్నికల సిబ్బందికి భోజనాలు కాకుండా బిర్యానీ పొట్లాలను అందజేశారు. అవి నాణ్యతాలోపంతో ఉండడంతో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేశారు. ఆ పొట్లాలను ఆర్‌వో వెంకటరావుకు చూపించి.. మనుషులు ఇది తింటారా అని ప్రశ్నించారు. తమకు అన్నం, సాంబారు,పెరుగు పెడితే కడుపునిండా తినేవారమన్నారు. ఎల్‌ఎన్ పేట, భామిని, హిరమండలం, బూర్జ, తదితర మండలాల నుంచి వచ్చిన కె.చంద్రరావు, రాజారావు, శ్రీనివాసరావు, రమేష్ తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వం రూ.150 భోజనానికి మంజూరు చేస్తే తమను పస్తులతో ఉంచారన్నారు. సిబ్బంది చెప్పిన అంశాలతో ఆర్‌వో ఏకీభవించారు. వెంటనే మంచినీరు ప్యాకెట్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement