టెన్షన్ పడుతున్న బాలయ్య
అనంతపురం : పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ బాలయ్యకు టెన్షన్ పెరిగిపోతోంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఓటర్లకు డబ్బు ఎర వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అయితే డబ్బు పంపిణీ విషయంలో స్థానిక నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. పంపిణీ బాధ్యత తనకే ఇవ్వాలని ఓ మాజీ ఎమ్మెల్యే బాలయ్యను కోరుతుంటే ఆయన మాత్రం ససేమిరా అంటున్నట్లు సమాచారం.
దీంతో బాలయ్య వైఖరిపై నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.... హిందుపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, హరికృష్ణలను స్థానికులు గెలిపించినట్లు తనను కూడా ఆదరిస్తారన్న ఉద్దేశంతో బాలకృష్ణ హిందుపురాన్ని ఎంచుకున్నారు. తీరా బరిలో దిగాక పరిస్థితులను చూసిన బాలయ్య బెంబేలెత్తిపోయారు. తన కుటుంబ సభ్యులతో పాటు సినీ నటుడు ఆలీని కూడా ప్రచారానికి దించారు. అయితే జనం నుంచి స్పందన లేకపోవటంతో ఓటర్లకు తాయిలాలు వేసే పనిలో పడ్డారు. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయాలని ప్లాన్ వేశారు.
అయితే ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతమవుతున్న బాలయ్యకు డబ్బు పంపిణీ విషయం మరో సమస్యగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసినప్పటికీ ప్రజల నుంచి స్పందన లేకపోవటంతో మరో దఫా పందేరానికి బాలకృష్ణ సిద్ధం అయినట్లు సమాచారం. బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో తెప్పించిన నగదును హిందూపురం సమీపంలోని ఓ తోటలో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. తానే స్వయంగా డబ్బు పంపిణీ చేపడితే ఎక్కడ పట్టుబడతానోననే భయం, మరోవైపు ఎవరిని నమ్మాలనే సందేహంతో బాలయ్య సతమతమవుతున్నట్లు తెలిసింది.