'ఇవే ఫలితాలు పునరావృతం, అధికారంలోకి వస్తాం'
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల తీర్పు తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇవే ఫలితాలు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ పునరావృతం అవుతాయన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై ఆయన సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి మద్దతు ఇస్తున్నారనేందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పొన్నాల పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అభయ హస్తం ఇస్తుందన్నారు. వంద శాతం తమదే విజయం అన్న టీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో మూడో స్థానానికి పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
గెలుపు, ఓటములకు బాధ్యత వహిస్తానని తాను ముందే చెప్పానని పొన్నాల ఈ సందర్భంగా గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాల పాల్గొన్నారు.