కీలకం
- అత్యధిక మందికి అందని పోస్టల్ బ్యాలెట్లు
- దరఖాస్తు చేయనివారూ ఎక్కువే
సాక్షి, సిటీబ్యూరో : హోరాహోరీ పోరు.. పోటాపోటీ ప్రచారం.. ఒకే స్థానం-అభ్యర్థులు అధికం.. స్వపక్షంలోనే విపక్షం.. తిరుగుబాట్లు.. వెన్నుపోట్లు.. వెరసి ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. ఈ నేపథ్యంలో నేతల రాతలు మార్చే బుల్లెట్‌గా మారనుంది పోస్టల్ బ్యాలెట్. ఈసారి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో దీని పాత్ర కీలకం కానుంది. కానీ గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న పలువురికి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
గ్రేటర్ పరిధిలో 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే సుమారు 18 వేల మం దికే అందినట్లు సమాచారం. దీంతో దరఖాస్తు చేసుకున్నా తమకు నేటికీ పోస్టల్ బ్యాలెట్ అందలేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. తాము ఓటు హక్కు వినియోగించుకోవద్దా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు దరఖాస్తే చేసుకోని వారు కూడా తక్కువేమీ లేరు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చు.
ఇందుకోసం ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కావాలని తాము ఏ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును ఉద్యోగి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గ రిట ర్నింగ్ అధికారికి పంపిస్తారు. ఓటరు జాబితాలో పేరు తదితరమైనవన్నీ నిర్ధారించుకొని సంబంధిత ఉద్యోగికి పోస్టు ద్వారా ఈ పోస్టల్ బ్యాలెట్‌ను పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేసే ఉద్యోగి తిరిగి దానిని పోస్టు ద్వారా గాని.. లేక సంబంధిత రిటర్నింగ్ అధికారికి నేరుగా గాని అందజేయవచ్చు.
ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుండగా, 15లోగా కానీ.. లేదా 16న ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి గం ట ముందు గాని అందజేయవచ్చు. అయితే గత నెల 30న పోలింగ్ జరగ్గా.. 28లోగా దరఖాస్తు చేసుకున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపించామని అధికారులు చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా దరఖాస్తు చేసుకున్నా.. తమకింకా పోస్టల్ బ్యాలెట్ అందలేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు.
దరఖాస్తే చేయని తీరు...
కొన్ని నియోజకవర్గాల్లో ఓటు హక్కున్న ఉద్యోగులు చాలామంది అసలు దరఖాస్తే చేసుకోలేదు. ఉదాహరణకు ముషీరాబాద్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులైనవారు దాదాపు 3 వేల మంది ఉద్యోగులుండగా.. వారిలో 400 మంది మాత్రమే దరఖా స్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కొన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు నాలుక్కరచుకుంటున్నారు. గడువున్నప్పుడే వారు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకోమని చెప్పలేకపోయామని వాపోతున్నారు.
గ్రేటర్ పరిధిలో 28 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో దాదాపు 18 వేల మంది నుంచి ఓటు చేసిన బ్యాలెట్‌లు అందాయని సంబంధిత అధికారులు చూచాయగా చెబుతున్నారు. కచ్చితమైన సంఖ్య మాత్రం చెప్పలేకపోతున్నారు.
దరఖాస్తు చేసినా..
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటమిక్ ఎనర్జీలో పనిచేస్తున్న నాకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు అప్పగించారు. గతనెల 25న ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇంకా అందలేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న చోట వెంటనే ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఇవ్వలేదు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇంకా అందకపోవడంతో కొంత ఆందోళనగా ఉంది. - సీవీకే మోహన్ వర్మ