తాడిపత్రి పేరు వినగానే.. ఆ ఊరా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనం మాట్లాడుకోవడం మామూలే. ఇన్నాళ్లూ ఏకచక్రాధిపత్యంగా ఆ ఊరినేలిన జేసీ బ్రదర్స్‌కు ఇపుడు కష్టకాలమొచ్చింది. తమదైన శైలిలో అధికారులు, ప్రజలను బెదిరించి వారనుకున్నది చేయడంలో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. ప్రతి మాటలో వ్యంగం ప్రతిధ్వనించే శైలి జేసీ దివాకర్ రెడ్డిదైతే, శివాలెత్తి బీభత్సం సృష్టించడం ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిది. వీరి దౌర్జన్యానికి జడిసి ఇన్నాళ్లూ వీరికి ఎదురు లేకపోయినా, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనంతో స్థానికులకు ఇపుడు కొండంత బలం వచ్చింది. ఈవీఎంలో ఏ గుర్తుకు మీట నొక్కాలో ఇక తమకెవరూ చెప్పాల్సిన పనిలేదని నియోజకవర్గం ప్రజలు అంటున్నారు.
సాక్షి, అనంతపురం : తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం జేసీ సోదరుల్లో గుబులు రేపుతోంది. ఇన్నాళ్లూ తాడిపత్రిలో తమకెదురు లేదని భావిస్తున్న వారు తాజా పరిణామాలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కందిగోపుల మురళి ఇంటిపై దాడికి సంఘంబంధించిన కేసులో జేసీ పవన్ కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో వారు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వృద్ధ నేతలిద్దరూ గెలుపు కోసం కొత్త వ్యూహ రచన చేశారు. నియోజకవర్గంలోని గ్రామ స్థాయి నేతలు, కుల సంఘాల నాయకులను బలవంతంగా లొంగదీసుకుని తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ విషయంలో వారిని ఎదురించలేని గ్రామ నేతలు ఓటింగ్ రోజున తమ ప్రతాపమేంటో చూపడానికి సిద్ధంగా ఉన్నారని ఓ టీడీపీ నాయకుడు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ఇటీవల జిల్లాలో ప్రచారం నిర్వహించి వెళ్లారు. దీంతో జిల్లాలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
ఫ్యాన్ ప్రభంజనానికి 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేజారని అధికారం ఈమారు చేజారేలా కనిపిస్తోంది. జేసీ రాజకీయ కంచుకోట తాడిపత్రి బీటలువారుతుంటే..రాజకీయ అధికారానికి పునాదులైన అనుచరులు చల్లాచెదురై, వైఎస్సార్‌సీపీ జన బలం ముందు తాళలేక జేసీ ప్రభాకర్‌రెడ్డి దిక్కులు చూస్తున్నారు. ఒక్కరోజు నియోజకవర్గానికి తాను దూరమైనా ఇక ఎమ్మెల్యే కుర్చీ కల తనకు శాశ్వతంగా దూరం అవుతుందేమేనన్న ఆందోళనతో ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రికే పరిమితం అయిపోయారు.
కనీసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చినపుడు కూడా మర్యాదపూర్వకంగా కూడా ఆయన రాకపోవడం ఇందుకు అద్దం పడుతోంది. తనను కాదని వైఎస్సార్‌సీపీలో చేరిన ముఖ్య అనుచరులు దూరం కావడం, గడిచిన మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో గంపగుత్తగా ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపడం జేసీ ప్రభాకర్‌రెడ్డి విజయావకాశాలను తీవ్రంగా దెబ్బ తీసింది. సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా జరుగుతున్నపుడు ఆర్టీసీ బస్సులు సైతం బంద్ చేసి కార్మికులు రోడ్డుపైకి వచ్చిన వేళ.. జేసీ ట్రావెల్స్ బస్సులు మాత్రం యధావిథిగా తిప్పడం.. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేయడం సమైక్యవాదులెవరూ మరచిపోలేదని ఆయన అనుచరులే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్న వీఆర్‌రామిరెడ్డి
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వీఆర్ రామిరెడ్డి ప్రణాళికా బద్దంగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వీఆర్ సేవా సంస్థ ద్వారా నియోజకవర్గ ప్రజలను సుపరిచితుడైన వీఆర్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో జోరుమీదున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వీఆర్ రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అప్పటికే గడప..గడపకు అంటూ ప్రతి గడపను టచ్ చేశారు. నోటిఫికేషన్ అనంతరం రెండో విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకుని మూడోవిడత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోతూ..అందర్ని ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. అభివృద్ది అనేది ఏ విధంగా ఉంటోందో ప్రజలకు అర్థం అయ్యేలా చెబుతూ ముందుకెళుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు క్షుణ్ణంగా వివరిస్తున్నారు. స్వతహాగా మృధుస్వభావి అయిన వీఆర్ రామిరెడ్డిలాంటి వారు ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో శాంతిభద్రతలు బాగుంటాయని స్థానికులు సైతం ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. కొంత మంది బయటపడి పనిచేయడానికి జంకుతున్నా పోలింగ్ రోజు చేయాల్సింది చేస్తామని హామీ ఇస్తున్నారు.
జేసీ.. చేతులెత్తేసినట్లే..!
ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి పూర్తిగా వెనకబడిపోయారు. పార్టీ శ్రేణులు ఎవరూ సహకారం అందించకపోవడంతో ఆయనకు ఏమీ పాలుపోవడం లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వం.. ఇటు పట్టణ, అటు గ్రామీణ ప్రాంత ఓటర్లంతా ఏవగించుకునే దశకు చేరిందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, పలక్కపోతే, గుడ్లు ఉరిమి చూడడం లాంటి ఘటనలు ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.
తొలి నుంచి తాడిపత్రి మునిసిపాలిటీలో ఓటర్లను బెదిరించి తన మాట వినని నాయకులపై అక్రమ కేసులు పెట్టించి తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ వచ్చారు. అయితే ప్రభాకర్‌రెడ్డి తీరు మునిసిపాలిటీ వరకే పరిమితం అయింది. మొత్తం నియోజకవర్గం అంతా ఆయన ఇప్పటి వరకు తన చెప్పుచేతుల్లో పెట్టుకోలేక పోయారు. తాడిపత్రి రూరల్, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో ప్రభాకర్‌రెడ్డి తీరుపట్ల ఆ పార్టీ కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కించపరిచే రీతిలో ఆయన మాట్లాడడం పార్టీ కేడర్‌కు ఏమాత్రం మింగుడుపడడం లేదు. చంద్రబాబును సైతం హేళన చేసే విధంగా ఆయన మాట్లాడడం ఆ పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. తన మాట వినకపోతే ఎస్సీ, ఎస్టీలను రెచ్చగొట్టించి అక్రమ కేసులు పెట్టిస్తారనే భయం వారిలో నెలకొంది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ఆయన వ్యవహరించిన తీరు వైస్ చైర్మన్‌గా ఉన్నపుడు చైర్మన్ వెంకట్రమణను డమ్మీ చేసి పాలన వ్యవహారాలు తానే చక్కబెట్టడం, అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించడం లాంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట వినని వారందర్ని నయానో..భయానో లొంగ దీసుకుని ..వారిని ఇతర కేసుల్లో ఇరికించి తన చుట్టూ తిప్పుకోవడం ఆనవాయితీగా మారిందని ఆయన బాధితులు పేర్కొంటున్నారు. గతంలో పామిడిలో ఇదే విధంగా ఓవర్గాన్ని తన వద్దకు చేర్చుకుని పలు కేసుల్లో వారిని ఇరికించి తమ చుట్టూ తిప్పుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్సు గల్లంతయింది. ఆ పార్టీ నుంచి విశ్వనాథరెడ్డి అభ్యర్థిగా ఉన్నా నామమాత్రమేనని చెప్పవచ్చు. కాగా, 1955లో ఏర్పాటైన తాడిపత్రి నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై చల్లా సుబ్బరాయుడు స్వతంత్య్ర అభ్యర్థి వలిపిరెడ్డి ఆదినారాయణరెడ్డిపై 15,840 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు.
వామ్మో ఆయనా!
Published Fri, May 2 2014 1:29 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement