కేంద్ర నిధులు దారి మళ్లించారు: రాహుల్
ఒడిషాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను దారి మళ్లించిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిషాలోని నవరంగ్పూర్లో ఆయన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. రైతులు వివిధ ప్రాజెక్టుల కోసం తమ వ్యవసాయ భూమిని ఇచ్చినప్పుడు వారికి సరైన పరిహారం లభించేలా యూపీఏ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆయన అన్నారు.
అయితే, గిరిజన ఉపప్రణాళిక నిధులను ఒడిషాలో ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అసలు పేదలు, గిరిజనుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. ఒడిషాలోని మొత్తం 147 అసెంబ్లీ, 21 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 10, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.