ప్రధాని అయితే మీరేం చేస్తారు..?
మొయినాబాద్: ’రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. మార్కెట్‌కు తెస్తే.. గిట్టుబాటు ధర ఉండదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నాం. తెలంగాణలో కరెంటు కూడా సరిగా ఉండదు. మీరు ప్రధానమంత్రి అయితే రైతుల కోసం ఏం చేస్తారు..’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీరాంనగర్ రైతు బల్వంత్‌రెడ్డి ప్రశ్నలు అడిగారు.
చాయ్‌పే చర్చా పేరుతో సీఏజీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీతో రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడే లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని శ్రీరాంనగర్‌లో గురువారం రాత్రి నిర్వహించారు. రైతు బల్వంత్‌రెడ్డి రైతుల సమస్యలు మోడీకి వివరించారు. దీంతో ఆయన సమాధానం చెబుతూ.. గ్రానైట్, ఇతర వ్యాపార వస్తువులు ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు ఎన్ని రోజుల సమయం పట్టినా అవి చెడిపోవని, అదే రైతు పండించిన టమాటాలు మాత్రం ఇతర ప్రాంతాలకు ట్రక్కుల్లో రవాణా చేస్తే నిల్వ ఉండవన్నారు.
రైళ్లలో కోల్డు స్టోరేజీలు ఏర్పాటు చేసి వాటిని రవాణా చేసే సదుపాయం ప్రభుత్వం కల్పించాలని కోరారు. దీంతో.. మోడీ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఫుడ్ కార్పొరేషన్‌ను మూడు విభాగాలుగా చేస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కృషి చేస్తామనడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు.