
సమరానికి సై
సాక్షి, మచిలీపట్నం :
మున్సిపల్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించి తలపడుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోను మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 218 వార్డుల్లో బహుముఖ పోరు నెలకొంది. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పుతో ఆయా పార్టీల అభ్యర్థుల బలాబలాలు తేల నున్నాయి.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోను వైఎస్సార్‌సీపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ పోటీపడి బరిలోకి దించింది. ఇప్పటికే రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకుంటున్న కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఓటమి భయం వెంటాడడంతో కాంగ్రెస్ తరఫున పోటీకి అంతా వెనుకడుగు వేశారు.
ఉయ్యూరులో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో దించితే ఓటమి తప్పదని భావించి వ్యూహాత్మకంగా స్వతంత్ర అభ్యర్థులను బరిలో దించారు. ఉయ్యూరు నుంచి 20 వార్డులకు సారథి అభ్యర్థులను పెట్టడం గమనార్హం. మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టిన జైసమైక్యాంధ్ర పార్టీకి ఒకే గుర్తు వచ్చే అవకాశం లేనందున జగ్గయ్యపేట మున్సిపాలిటీలో సమైక్య తెలుగు రాజ్యం పార్టీ పేరుతో అభ్యర్థులను బరిలో దించారు.
బందరు, నందిగామ టాప్..
బందరు మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను ఏకంగా 156 మంది అభ్యర్థులు, నందిగామలో 20 వార్డులకు 158 మంది పోటీలో ఉండడం రికార్డు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేస్తున్న రికార్డు నందిగామ, బందరు మున్సిపాలిటీలకు దక్కింది.
బందరుతోపాటు పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డుల్లో త్రిముఖ పోరు నెలకొంది.
జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లోను 218 వార్డులకు గాను 859 మంది బరిలో ఉన్నారు. పోటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 209 మంది ఉన్నారు. మిగిలిన వార్డుల్లో సీపీఎంకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలికింది.
216 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీకి నిలిచారు. కాంగ్రెస్ కేవలం 103 మందిని మాత్రమే బరిలో దించింది. బీజేపీ 30 వార్డుల్లో పోటీ చేస్తోంది. సమైక్య తెలుగురాజ్యం పార్టీ తరపున 16 మంది పోటీ చేస్తున్నారు. లోక్‌సత్తా 7, సీపీఎం 16, సీపీఐ 8, బీఎస్‌పీ మూడు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మూడు వార్డుల్లోను పోటీ చేస్తున్నాయి. స్వతంత్రులు 248 మంది బరిలో నిలిచారు.
స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల బీ ఫారం సమర్పించిన అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. మిగిలిన వారిని స్వతంత్రులుగా పరిగణించి గుర్తులు కేటాయించారు. పోలింగ్ తేదీకి ప్రచార గడువు మరో పది రోజులే ఉండడంతో అభ్యర్థులు ఇక ప్రచారబాట పట్టారు.