మీదే బాధ్యత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఈ పోరులో విజయం సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. ీ
సనియర్లను సమన్వయపరుచుకుంటూ ప్రచారపర్వాన్ని కొనసాగించాలన్నారు.మండల/ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్థానిక, సాధారణ ఎన్నికల వరకు పార్టీని సమన్వయపరుచుకునేందుకు వీలుగా జిల్లా స్థాయిలో మూడు కమిటీలు వేయాలని పొన్నాల సూచించారు. ప్రచార కమిటీ, మేనిఫెస్టో, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, వీటిని రాష్ట్రస్థాయి కమిటీతో అనుసంధానం చేసుకోవాలన్నారు. జిల్లా సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశంపై జిల్లాస్థాయి సిఫార్సులు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
దానంపై ఫైర్!
గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ రంగారెడ్డి జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. రంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థులను దానం ప్రకటించడంపై కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశా? దానం నాగేందరా? అని ప్రశ్నించారు. గతంలోనూ ఇలా జిల్లా పరిధిలోని అంశాలపై కలగజేసుకున్నారని, ఇది సరికాదని అన్నారు. సర్వే, ఇతర ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించిన పొన్నాల, ఉత్తమ్.. దానం తీరును తప్పుబట్టారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ కార్యక్రమాలను డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.
జెడ్పీ అభ్యర్థిగా యాదవరెడ్డి
జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డిని ప్రకటించేందుకు టీపీసీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. సొంత మండలం నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగాలని యోచిస్తున్నానని, జెడ్పీ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని యాదవరెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు.. గెలుపే లక్ష్యంగా పనిచేయండని, అందరం సహకరిస్తామని భరోసా ఇచ్చారు.
ఇదిలావుండగా, జిల్లా పరిషత్‌పై కన్నేసిన కొంతమంది నేతలు ఇతర మండలాల నుంచి పోటీకి దిగుతున్నారని, దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, భిక్షపతి యాదవ్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో తలమునకలైనందున ఈ సమావేశానికి మాజీ మంత్రులు సబిత, ప్రసాద్‌కుమార్ హాజరుకాలేదు.