సన్యాసికి కాంగ్రెస్ టికెట్
బిజెపి అనుకూల యోగ గురు బాబా రామ్ దేవ్ పై ఫిర్యాదులు చేసి, కేసులు వేసి చీకాకు పెట్టిన ఇంకొక స్వామీజీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని సంబల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంటే రామ్ దేవ్ ని కేసులతో శీర్షాసనం వేయించినందుకు ఆ బాబాజీకి కాంగ్రెస్ 'సుఖాసన్' సమర్పించుకుంటోందన్నమాట!
రామ్ దేవ్ గురువైన స్వామి శంకరదేవ్ 2007 నుంచీ కనిపించడం లేదు. ఆయన పతంజలి యోగపీఠ్ ప్రారంభించిన కొద్ది రోజుల తరువాతే అదృశ్యం అయిపోయారు. దీన్లో బాబా రామ్ దేవ్ హస్తం ఉందని స్వామి ప్రమోద్ కృష్ణం ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగానే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ... కాదు కాదు... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రామ్ దేవ్ పై దర్యాప్తు చేస్తోంది. ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి పీఠాధిపతి. ఆయన అఖిల భారత సంత్ సమాజ్ అధ్యక్షులు కూడా.
స్వామీజీ ఎన్నికైతే కాంగ్రెస్ కి డబుల్ లాభం. ఆయన చెయ్యి చూపిస్తే ఆశీర్వదిస్తున్నారో లేక వోటడుతున్నారో ఎన్నికల అధికారులకు అర్థం కాకుండా ఉంటుంది.
అయితే ఆచార్య శ్రీ కూడా తక్కువేం తినలేదు. 2007 అజ్మీర్ పేలుళ్లలో ప్రధాననిందితుడైన భవేశ్ పటేల్ పోలీసు దర్యాప్తులో సదరు స్వామీజీ పేరు కూడా చెప్పారు. అంతే కాదు. కొందరు కాంగ్రెస్ నేతలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల రహస్య సమావేశాలను కూడా స్వామీజీ ఏర్పాటు చేయించారట.