మందు పార్టీల కర్సు రూ.50 కోట్లు
నెల్లిమర్ల, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యం ఏరులైపారింది. ఎన్నికలకు నెలరోజుల ముందే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మద్యాన్ని కొనుగోలుచేసి నిల్వ ఉంచారు. 20 రోజుల ముందునుంచే కార్యకర్తలకు మందు పోయడం మొదలుపెట్టారు. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు 50 కోట్ల రూపాయల మద్యాన్ని గుటకాయ స్వాహా చేశారు. దీనిలో రూ.నలభైకోట్ల విలువైన మద్యం జిల్లాలోని గొడౌన్ నుంచే సరఫరా కాగా, మరో పదికోట్ల రూపాయల విలువైన మద్యం పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అయింది. ఎన్నికల సందర్భంగా మొత్తం 1.10 లక్షల బ్రాందీ కేసులు, 77వేల బీరుకేసులు అమ్ముడయ్యాయంటే మందుబాబులు ఎంత మజా చేసుకున్నారో అర్థమవుతోంది.
గత ఏడాది కంటే అదనంగా మద్యాన్ని సరఫరా చేయరాదనే నిబంధన ఉండకపోతే ఈ విక్రయాలు మరింత పెరిగేవి.ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చెందిన అభ్యర్థులు నెలరోజుల ముందు నుంచే మద్యం కొనుగోలుచేసి నిల్వ చేయడం మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగానున్న సుమారు 200 మద్యం దుకాణాల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మద్యం కొనుగోలుచేసి నిల్వ ఉంచారు. ఈ విధంగా మొత్తం రూ.40 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. దీనిలో 1.10 లక్షల వైన్ కేసులున్నాయి. అలాగే మరో 77 వేల బీరు కేసులున్నాయి. ఎన్నికలకు ముందు ఈ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే నెల్లిమర్లలోని గోదాము నుంచి మద్యాన్ని సరఫరా చేశారు.
రెండు రోజుల్లో 6,558 వైన్ కేసులు, 6,100బీరు కేసులు ఉన్నాయి. వీటి విలువ రూ 2.66కోట్లు. మద్యం పంపిణీపై ప్రభుత్వం నియంత్రణ విధించడంతో ఓటర్లకు సరిపడేలా పంపిణీ చేసేందుకు మద్యం లభ్యం కాలేదు. దీంతో పొరుగు రాష్ట్రాలపై పడ్డారు. ముఖ్యంగా గోవా, ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తీసుకొచ్చారు. ఈ విధంగా దిగుమతి చేసుకున్న మద్యం విలువ పది కోట్ల రూపాయలు దాటే ఉంటుందని అంచనా. అంతేకాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పలువురు అభ్యర్థులు మద్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్క గ్రామానికి అన్ని పార్టీలు కలిపి వంద మద్యం కేసులు సరఫరా చేశాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో యువత మస్తుగా మజాచేశారు. యువతను తమవైపు తిప్పకునేందుకు అభ్యర్థులు ఈసారి మందు పార్టీలు ఇచ్చారు.