పుర ఫలితం తేలింది
సాక్షి, గుంటూరు :జిల్లాలోని 12 పురపాలక సంఘాలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ 10.30 గంటలకే దాదాపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 11 మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. మంగళగిరి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తాడేపల్లి మున్సిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. నరసరావుపేట ఏఎంరెడ్డి కళాశాలలో నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, పిడుగురాళ్ళ, వినుకొండ మున్సిపాలిటీలకు సంబంధించిన లెక్కింపును నిర్వహించారు.
ఈ ప్రక్రియను ఆర్డీవో శ్రీనివాసరావు పర్యవేక్షించారు. తెనాలి జేఎంజే కళాశాలలో తెనాలి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె మున్సిపాలిటీల లెక్కింపు జరిగింది. తెనాలి ఆర్డీవో శ్రీనివాసమూర్తి కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో సత్తెనపల్లి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, అర్బన్ ఎస్పీ జెట్టిగోపినాథ్‌లు పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద రూరల్, అర్బన్ ఎస్పీల పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు అబ్జర్వర్లుగా నరసింహం, అనితారాజేంద్రన్‌లు వ్యవహరించారు. అదనపు పర్యవేక్షకులుగా ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు విధులు నిర్వహించారు.
స్వల్ప తేడాతో టీడీపీ వశం.. తాడేపల్లి పురపాలక సంఘంలో వైఎస్సార్ సీపీ సత్తా చాటింది. మొత్తం 23 వార్డులకు 18 వార్డులను ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో కైవసం చేసుకున్నారు. టీడీపీ 11 మున్సిపాలిటీలు సొంతం చేసుకున్నప్పటికీ అత్యధిక స్థానాల్లో స్పల్ప మెజారిటీనే దక్కింది. చిలకలూరిపేట, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరుల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈ నాలుగు స్థానాలను రెండు, మూడు వార్డుల తేడాలో టీడీపీ దక్కించుకుంది. సత్తెనపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా, 13 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 15 వార్డుల్లో టీడీపీ, ఒకటి కాంగ్రెస్, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఇక్కడ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో తేలని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో వివిధ పార్టీలకు దక్కిన వార్డు స్థానాల వివరాలు