పట్టిందంతా డబ్బు కాదా?
అయిదుకోట్లు స్వాధీనం... ఏడు కోట్లు స్వాధీనం అంటూ ఎన్నికల వేళ రోజూ వస్తున్న వార్తలన్నీ నిజమేనా? కాకపోవచ్చునంటున్నారు ఎన్నికల సంఘం పనితీరు తెలిసిన వారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకూ దాదాపు 129 కోట్ల నగదు పట్టుబడింది. ఈ నిధులన్నీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకే ఉద్దేశించినవా? ఎన్నికల వేళ ఎంతో నిఘా ఉంటుందని తెలిసిన రాజకీయ పార్టీలు, నేతలు ఇప్పుడు నగదును ఒక చోట నుంచి మరొక చోటికి తీసుకువెళ్లేంత అమాయకులా?
చాలా సందర్భాల్లో పెట్రోలు బంకులు, వ్యాపార సంస్థలు నగదును తరలిస్తూంటే పట్టుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఎన్నికల అక్రమ ఫండ్ లెక్కల్లో చూపించేస్తారు. పబ్లిసిటీ బాగానే లభిస్తుంది. కానీ తరువాత పట్టుబడ్డ సొమ్మును పోలీస్ డిపాజిట్ ఫండ్ లో జమచేస్తారు. ఆ తరువాత ఈ నిధి ఎక్కడిది, ఎవరిది వంటి దర్యాప్తులు మొదలవుతాయి. ఆదాయపు పన్ను శాఖ ఆ నిధి ఎక్కడిది, న్యాయమైన సొమ్మేనా అన్నది దర్యాప్తు చేస్తుంది. సంతృప్తికరమైన జవాబులు దొరక్కపోతే ఈ డబ్బును కోర్టులో జమ చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో పోలీసులు కేసులు కూడా దాఖలు చేయడం లేదు. విచారణా చేయడం లేదు. కొన్ని సార్లు ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసే క్యాష్ తరలింపు సంస్థల వ్యాన్లను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ తరువాత ఆయా సంస్థలకు తిరిగి ఇచ్చేస్తారు.
ఒక్క మనరాష్ట్రంలోనే కాదు. మహారాష్ట్రలో 33.46 కోట్లు, తమిళనాట 19.87 కోట్లు, కర్నాటకలో 12.29 కోట్లు, ఉత్తరప్రదేశ్ లో 12 కోట్లు, పంజాబ్ లో 5 కోట్లు పట్టుబడ్డాయి. కానీ విలిలో చాలా వరకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
అయితే డబ్బులకన్నా పట్టుబడుతున్న మద్యం విషయంలో ఎక్కువ ఆందోళన చెందాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఇప్పటి వరకూ 132 కోట్ల లీటర్ల మద్యం దేశవ్యాప్తంగా పట్టుబడింది. అంటే దేశంలోని మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లలో ప్రతి ఒక్కరికి 1.6 లీటర్ల మద్యం అందేందుకు పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయన్న మాట. ఇంతకన్నా అందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా వోటర్లను మత్తులో ముంచెత్తేందుకు 104 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముఖ్యంగా పంజాబ్ లో మాదక ద్రవ్యాలు పెద్దమొత్తంలో స్వాధీనం అయ్యాయి. ఇంకా మరో అయిదు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అంటే ఇంకెంత మొత్తంలో డ్రగ్స్, మద్యం పట్టుబడతాయో చూడాలి.