మోడీ - పవార్ భాయీ భాయీ?
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రంగు మారుస్తున్నారా? రాబోయే ఎన్నికల్లో ఎటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి.. ఆయన తన స్టాండు మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీకి, బీజేపీకి ఆయన క్రమంగా దగ్గరవుతున్నట్లే అనిపిస్తోంది. తనకు శతృత్వ రాజకీయాలంటే నమ్మకం లేదని ఆయన అంటున్నారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లకు మోడీని బాధ్యుడిని చేయడం సరికాదని, కోర్టు కూడా ఆయనను నిర్దోషిగా తేల్చిందని పవార్ అన్నారు. కోర్టు కూడా తేల్చిన తర్వాత పదే పదే అదే అంశాన్ని ఎందుకు లేవనెత్తుతారని ప్రశ్నించారు. అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవార్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాను జనవరిలో మోడీతో సమావేశమయ్యానని, అయినా అందులో రహస్యం ఏమీ లేదని శరద్ పవార్ చెప్పారు. తామిద్దరం కేవలం టీ, కాఫీల గురించి మాత్రమే మాట్లాడుకున్నట్లు ఆయన తెలిపారు. దానికంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదని పవార్ అంటున్నా, ఎన్సీపీ మాత్రం యూపీఏను వదిలిపెట్టి, ఎన్డీయే వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.