మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నుంచి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ఘన స్వాగతం లభించింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నుంచి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ఘన స్వాగతం లభించింది. ఉలవపాడు వద్ద అభిమానులు ఆమెకు ఆహ్వానం పలికారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో ఆమెకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆమె అక్కడే మధ్యాహ్న భోజనం ముగించుకుని ఒంగోలు మీదుగా చీమకుర్తి చేరుకున్నారు. మార్గమధ్యంలో సింగరాయకొండ వద్ద ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు తన అనుచరులతో షర్మిలకు స్వాగతం పలికారు. దారిపొడువునా ఆమె కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నారు.
ఒంగోలు బైపాస్‌రోడ్డు వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి షర్మిలకు జేజేలు పలికారు. చీమకుర్తిలో వేలాది మంది షర్మిల రాకకోసం మధ్యాహ్నం నుంచే రోడ్లపై బారులు తీరారు. ఆమె రాగానే బాణసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. దివంగత నేత వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి, ఆయన హయాంలో ధరలు పెంచకుండా ప్రజలను ఏ విధంగా ఆదుకున్నారో ఆమె పూసగుచ్చారు. అనంతరం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలను తూర్పారబట్టారు. తొలుత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ సీఎం అయితే వైఎస్‌ఆర్ పాలన మళ్లీ వచ్చినట్లేనన్నారు.
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ తరఫున ఆయన సోదరి షర్మిల మన వద్దకు వచ్చారని చెప్పారు. వచ్చే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బాలినేని పిలుపునిచ్చారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డికి షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభలో చీమకుర్తి మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ వరకూటి అమృతపాణి, అంగలకుర్తి రవి పాల్గొన్నారు. అక్కడి నుంచి షర్మిల పొదిలి మీదుగా కనిగిరి చేరుకున్నారు. పొదిలిలో కూడా ఆమెకు వేలాది మంది స్వాగతం పలికారు.
కనిగిరిలో వైఎస్‌ఆర్ విగ్రహం నుంచి రోడ్డుకిరు వైపులా జనం భారీ ఎత్తున చేరుకుని ఆమెకు జేజేలు పలికారు. కనిగిరిలో పార్టీ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి నాయకత్వంలో బహిరంగ సభ నిర్వహించారు. రానున్న మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని షర్మిల కోరగా ప్రజలు చప్పట్లతో తమ సమ్మతి తెలిపారు. ఈ సభలో పార్టీ సమన్వయకర్త కాటం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. షర్మిల పర్యటన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జరిగింది. బహిరంగ సభలకు ముందు వంగపండు ఉష బృందం పాటలు ఓటర్లను ఆలోచింపజేశాయి.