చిత్తరంజన్ దాస్
న్యూఢిల్లీః తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతందని మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్ అన్నారు. ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ శాససన సభ సీట్ల కేటాయింపులో ఒక్కో జిల్లాకు నాలుగు చొప్పున కనీసం 40 సీట్లు ఓబీసీలకు కేటాయించాలని కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక తెలంగాణలో ఓబీసీలందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశతో బీసీలు ఉన్నారన్నారు.
అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం జరుగుతున్న సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న భయాందోళనలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించాలన్నా, రాహూల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి సీట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. ఓవైపు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బీసీ నినాదంతో వస్తున్నారని, తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌పార్టీలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు.
నాలుగు శాతంలో ఉన్న అగ్రకులాలకు అధిక సీట్లు కేటాయించి, 56 శాతం ఉన్న బీసీలకు జిల్లాకు ఒక సీటు ఇస్తే ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని హెచ్చరించారు. చెన్నారెడ్డి తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీని, రాహూల్ గాంధీని నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతోనే మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ అధిష్టానం స్పందించి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు సమప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దీనిపై దిగ్విజయ్‌సింగ్‌కి కలిసి చెప్పినట్లు తెలిపారు. గెలవగలిన శక్తి ఉన్న ఓబీసీ నాయకులను ఎంపిక చేసి అత్యధిక మందికి సీట్లు కేటాయించాలన్నారు. సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలతో అధికారంలోకి రాలేమని, సామాజిక న్యాయమూ ముఖ్యమే అని ఆయన సూచించారు.