వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ
సోమందేపల్లి, న్యూస్‌లైన్: మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ తెలిపారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కంచుకోటగా భావిస్తున్న పెనకొండలో విజయం సాధిస్తామన్నారు. అన్నిచోట్లా ఫ్యాను గాలి బలంగా వీస్తోందన్నారు. రాష్ట్రంలో అధికశాతం ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
టీడీపీ, కాంగ్రెస్‌లు ఏకమై రాష్ట్రాన్ని విభజనకు కారణమయ్యాయన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలవాలన్నా జగన్ వల్లే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ చెపుతున్న 5 సంతకాలు ప్రజల మనసులో నిలిచిపోయాయన్నారు. పెనుకొండ నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ బలంగా ఉందన్నారు. జిల్లా పరిషత్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పెనుకొండ నియోజక వర్గం సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ, నాయకులు గుట్టూరు శ్రీరాములు, అత్తర్‌ఖదిర్ తదితరులు ఉన్నారు.