మున్సిపల్ ఫలితాలపై సుప్రీం తాత్కాలిక స్టే
న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన తేదీపై మళ్లీ సందిగ్దత నెలకొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 9న ఫలితాలు వెలువడకపోయే అవకాశముంది. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫలితాలను ఈ నెల 9న ప్రకటించేందుకు అనుమతిచ్చింది. కాగా త్వరలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశముందని, కావున వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. మండల్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలను కూడా సాధరణ ఎన్నికల అనంతరం ప్రకటించాలని ఇటీవల తీర్పు వెలువరించిన విషయం విదితమే.