ఒక్కసారి చెబితే.. మోడీ బలమైన నేత: రజనీకాంత్
తమిళ రాజకీయాలపై సినిమా ప్రభావం అంతా ఇంతా కాదు. 1950ల నుంచే తమిళ నాట సినిమా, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. తమిళ ఓటర్లను ప్రభావితం చేయడంలో తమిళ సినీస్టార్లు ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటిది సూపర్ స్టార్ రజనీకాంతే సానుకూలంగా మాట్లాడితే.. ఏ పార్టీకైనా అది బంపర్ ఆఫరే. తమిళనాడులో తమ పార్టీని పాగా వేయించాలంటే రజనీ సర్ సపోర్ట్ తప్పదని అర్థమైన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఏకంగా రజనీకాంత్ ఇంటికే వెళ్లారు. అయితే, మోడీని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన రజనీకాంత్.. మద్దతు విషయంలో మాత్రం ఆచితూచి మాట్లాడారట.
‘మోడీ బలమైన నేత. మంచి పాలనాదక్షుడు. ఆయన ఆకాంక్ష నెరవేరాలి’ అని వ్యాఖ్యానించారట. అది చాలు అనుకున్న రాష్ట బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను, మోడీ-రజనీకాంత్ ఫొటోలను తమ ప్రచారంలో విపరీతంగా వాడుకుంటున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో బీజేపీ ఆరు మిత్రపక్షాల్లో ఒకటైన ఎండీఎంకే కూడా రజనీకాంత్‌ను ఇటీవల తమ అధినేత వైగో కలిసి మద్దతు కోరినప్పటి ఫొటోను ప్రచారంలో ఉపయోగించుకుంటోంది. డీఎంకే బహిషృ్కత నేత, ఆ పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి కూడా ఇటీవల రజనీకాంత్‌ను కలిశారు.