* మోడీ ప్రధాని కావాల్సిందే: చంద్రబాబు
* దేశాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలంగాణలో టీడీపీ, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైన యువకులంతా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలకు కేంద్రం సహకారం అవసరమని, విద్యుత్, ఉద్యోగాలు, నీటి సమస్య పరిష్కారం కావాలంటే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావాలని అన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పాలన దేశాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో, అంతకుముందు మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభల్లో బాబు ప్రసంగించారు.
అప్పట్లో ఎన్డీయే సహకారంతో హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. తాము చేసిన అభివృద్ధిని అడ్డుపెట్టుకొని టీఆర్‌ఎస్ డబ్బులు వసూలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేత తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని, రాహుల్‌గాంధీకి రాజకీయూల పట్ల అవగాహనే లేదంటూ.. వీరి చేతుల్లో దేశాన్ని పెడితే ఏమవుతుందో ఆలోచించాలని సభికులను కోరారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, అక్రమాలు, అవినీతికి సోనియా అండగా నిలిచారని ఆరోపించారు.
ఫలితంగా దేశంలో అభివృద్ధి ఆగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. దేశ ప్రధానిగా నరేంద్రమోడీ వస్తే తప్ప ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని, పెరిగిన ధరలు దిగిరావాలంటే ఆయన ప్రధాని కావాల్సిందేనని చెప్పారు. మూడోసార్లు ముఖ్యమంత్రి అయిన మోడీ సమర్థవంతమైన నాయకుడని కితాబిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఆయన ప్రభంజనం వీస్తోందని అన్నారు. ‘ఇది మోడీ ప్రచార సభలా లేదు, ప్రమాణ స్వీకార సభలా కనిపిస్తోంది. దేశంలో అందరూ ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. గుజరాత్ తరహాలో అభివృద్ధి చేసి మోడీ భారత్‌ను ప్రపంచంలోనే అగ్ర దేశంగా చేస్తారనడంలో అనుమానం లేదు..’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
టీడీపీ, బీజేపీ కూటమిదే విజయం: చంద్రబాబు
Published Wed, Apr 23 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM
Advertisement