సాక్షి, నెల్లూరు: టీడీపీ, బీజేపీ పొత్తు అతుకుల బొంతలా తయారైంది. రాష్ట్ర స్థాయిలో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచినా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య ఏమాత్రం పొసగడం లేదు. బీజేపీ ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఒంటరిగానే ప్రచారం చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు సొంతజిల్లాలోనే పొత్తు అపహాస్యం పాలుకావడం గమనార్హం. కుదరని పొత్తుతో ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని కిందిస్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో లుకలుకలు మొదలయ్యాయి. పొత్తులో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సీటును బీజేపీకి కేటాయించారు.
దీనిని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి భావించారు. పొత్తు నేపథ్యంలో ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో సోమిరెడ్డి అనుచరులు బహిరంగ విమర్శలకు దిగారు. బీజేపీకి కేడర్ లేని నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని, సోమిరెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమంటూ వాదించారు. పొత్తుల గొడవలు రచ్చకెక్కాయి. సోమిరెడ్డికి రూరల్‌లో అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కార్యకర్తలు టీడీపీ జిల్లా కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఏమాత్రం స్పందించని చంద్రబాబు నెల్లూరు రూరల్ సీటును బీజేకేకే కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి బరిలో నిలిచారు.
ప్రచారానికి దూరం దూరం
కార్యకర్తలతో పాటు కీలక నేతలు కూడా బీజేపీ ప్రచారాకు డుమ్మా కొట్టడం వారిలోని అసంతృప్తికి నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు రెండు రోజుల క్రితం నెల్లూరులో బీజేపీ నిర్వహించిన ప్రచార సభకు టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి డుమ్మాకొట్టారు. ఆదివారం బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు నెల్లూరులో నిర్వహించిన ర్యాలీకి కూడా ఆదాలతో పాటు టీడీపీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు.
ఇక గూడూరులో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి, ఎట్టకేలకు చంద్రబాబు దౌత్యంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన బల్లి దుర్గాప్రసాద్ కూడా ప్రచారానికి హాజరుకాలేదు. ఆ పార్టీల మధ్య పొత్తు లుకలుకలకు ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి.గ్రామస్థాయిలోనూ టీడీపీ కార్యకర్తలు బీజేపీకి మనస్ఫూర్తిగా మద్దతిచ్చేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పూర్తి స్థాయిలో సహకారం అందించక పోతే గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పట్టుబట్టి రూరల్ సీటును సాధించుకున్న బీజేపీ నేతలు, టీడీపీ నాయకుల పుణ్యమాని గెలుపు సాధించే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇప్పటికే బీజేపీ నేతలు తమ అధిష్టానంతో పాటు టీడీపీ అధిష్టానానికి సైతం ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ కలవని పొత్తులు వార్డు స్థాయిలోనూ కార్యకర్తల మధ్య తగాదాలకు తావిస్తోంది. రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించి గెలుపు కోసం ప్రయత్నం చేయకుండా ఎవరికి వారు వ్యవహరించడం వైఎస్‌ఆర్‌సీపీ విజయానికి మార్గాన్ని సుగమం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో టీడీపీ, బీజే పీ పొత్తు వికటించినట్లేనన్నది అందరి అభిప్రాయం.
కలవని పొత్తు
Published Mon, Apr 28 2014 3:04 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM