సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీడీపీ, బీజేపీ జాతీయ రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు కలిసి పనిచేయలేకపోతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో బీజేపీ నాయకులు పాల్గొనడం లేదు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతల పరస్పర సహకారం కొరవడడంతో పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది. పొత్తుల్లో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానం టీడీపీకి దక్కగా, ఎమ్మెల్యే స్థానం బీజేపీకి కేటాయించారు.
ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పాయల శంకర్ మధ్య తీవ్ర విభేదాలున్నాయి. పాయల టీడీపీలో ఉండగా ఈ విభేదాలు తలెత్తాయి. ఆదిలాబాద్ ఉప ఎన్నికల కోసం టీడీపీ నుంచి వచ్చిన పార్టీ ఫండ్ పంపకాల్లో వీరికి తేడాలు రావడంతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రెండు పార్టీల పొత్తు కారణంగా వారిద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, వీరు కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పైగా టీడీపీ పట్టణాధ్యక్షుడు మునిగెల నర్సింగ్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలపడం వెనుక రాథోడ్ జిమ్మిక్కు ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోథ్‌లో ఉమ్మడి అభ్యర్థి సోయం బాపూరావు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి కూడా నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి.
మంగళవారం రెండు పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి దక్కినా ముథోల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి రమాదేవి ప్రచారానికి టీడీపీ నాయకులు దూరంగా ఉన్నారు. పార్టీ టిక్కెట్ ఆశించిన నారాయణరెడ్డి, నామినేషన్ వేసిన లడ్డా తదితర నేతలు బీజేపీ ప్రచారంలో పాల్గొనడం లేదు. టీడీపీ శ్రేణులు దూరంగా ఉండటంతో చెన్నూరులో బీజేపీ అభ్యర్థి రాంవేణు ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల స్థానం కూడా బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఏకంగా పార్టీకే దూరమయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కొండేటి సత్యం తెరమరుగయ్యారు.
దీంతో బీజేపీ అభ్యర్థి మల్లారెడ్డి బీజేపీ శ్రేణులతోనే ప్రచారం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీకి దక్కిన నిర్మల్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి మీర్‌యాసిన్‌బేగ్ ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్య వంటి ముఖ్య నాయకులున్నారు. టీడీపీకి దక్కిన బెల్లంపల్లి అభ్యర్థి పాటి సుభద్రకు కూడా టీడీపీ శ్రేణులు అంతగా సహకరించడం లేదు. మొత్తం మీదా రెండు పార్టీల శ్రేణులు కలిసి ప్రజల్లోకి వెళ్లలేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
పొత్తు చిత్తవుతోంది!
Published Tue, Apr 15 2014 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement