సాక్షి, అనంతపురం : మునిసిపల్ ఎన్నికలు మరో 48 గంటల్లో జరగనున్నాయి. ఎన్నికల నిబంధనల మేరకు పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని శుక్రవారం సాయంత్రంతో ముగించారు. విజయం సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తాయిలాలు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించడంతో పాటు వైఎస్సార్‌సీపీకి ఓటు ఎందుకు వేయాలో కూడా చెబుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమలు చేసిన పథకాలన్నింటినీ ఆ తర్వాత వచ్చిన నేతలు నీరు గార్చారు. అ ఫలాలన్నీ తిరిగి అందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతున్నారు.
మునిసిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం కోసం వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కన్పిస్తోంది. దీంతో ఏదో ఒక విధంగా పరువు కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల చుట్టూ తిరుగుతూ ఈ ఎన్నికల్లో తమ విజయానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు డిమాండ్ చేసిన వాటికి తప్పని పరిస్థితుల్లో సరేనంటున్నారు. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు ప్రచారం చేయడమే మానేశారు. ఈ విధంగా ప్రతి మునిసిపాలిటీలోనూ ఎవరికి వారు అంతర్గతంగా సర్దుబాట్లు చేసుకున్నారనే సమాచారం జిల్లా కాంగ్రెస్ నేతలకు సైతం అందింది. 90 శాతం మంది ఓటర్లు తమ ఓటు ఎవరికి వేయాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.
తెలుగుదేశం పార్టీ నేతలు అమలు కాని హామీలు ఇస్తుండటంతో వారి మాటలను ఓటర్లు నమ్మడం లేదు. ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో తెలుగుదే శం పార్టీ వారు ఇంటికో ఉద్యోగం, ప్రతి మహిళకూ ఒక సెల్ ఫోన్ ఇలా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజల వద్దకు వస్తున్నారు. అయితే ఓటర్ల నుంచి ఆశించిన స్పందన కన్పించక పోవడాన్ని గుర్తించిన టీడీపీ నేతలు కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న అభ్యర్థులను తమ వలలో వేసుకుంటున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకొని పోవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కడా విజయం సాధించే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొన్ని ఓట్లు పడినా లాభం లేదని గుర్తించిన కాంగ్రెస్ అభ్యర్థులు దీపం ఉన్నట్లుగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో చేతులు కలిపి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ విధంగానైనా ఎన్నికల్లో కొంతమేర లాభపడే అవకాశం వుందని పోటీలో వున్న ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి చుట్టూ టీడీపీ నాయకులు తిరుగుతున్నారు.
అనంతపురం నగరపాలక సంస్థలో 50 డివిజన్లు, హిందూపురంలో 38 వార్డులు, గుంతకల్లులో 37, తాడిపత్రిలో 34, ధర్మవరంలో 40, కదిరిలో 36, రాయదుర్గంలో 31, మడకశిరలో 20, పుట్టపర్తిలో 20, గుత్తి 24, పామిడి 20, కళ్యాణదుర్గంలో 23 వార్డులు మొత్తం కలిపి 373 వార్డులకు ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో కాంగ్రెస్ నుంచి 146 వార్డులకు మాత్రమే రంగంలో వున్నారు. వీరిలో 75 శాతం మంది అభ్యర్థులు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో చేతులు కలిపి వారి విజయానికి కృషి చేస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. ఈ విషయం కాంగ్రెస్ నేతల దృష్టికి వచ్చినా వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వున్నారు.
టీడీపీ, కాంగ్రెస్ అంతర్గత సర్దుబాటు
Published Sat, Mar 29 2014 4:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement