చేతులెత్తేసిన ‘దేశం’ | tdp leaders in worry | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన ‘దేశం’

Published Tue, Apr 29 2014 1:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

చేతులెత్తేసిన  ‘దేశం’ - Sakshi

చేతులెత్తేసిన ‘దేశం’

  • రాథోడ్‌కు ఎదురుగాలి
  • కనుచూపు మేరల్లో కనిపించని విజయం
  • ఒక్కచోట మినహా ఎమ్మెల్యే అభ్యర్థులది అదేతీరు..
  • టీడీపీ దోస్తీతో వాడిన కమలం
  •  సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో గెలుపు ధీమా కనిపించడం లేదు. విజయావకాశాలు కనిపించక పోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు రెండు రోజుల క్రితమే చేతులెత్తేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు దూరమైనా.. మోడీ హవా కలిసొస్తుందని భావించారు. కానీ ఈ పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు దూరం కాగా, మోడీ గాలి మాత్రం రాథోడ్‌కు కలిసిరాలేదు. కారణమేమంటే.. పొత్తు ప్రకటించిన నాటి నుంచి జిల్లాలో బీజేపీ-టీడీపీ శ్రేణులు ఉప్పు.. నిప్పులా తయారయ్యాయి. ఆ రెండు పార్టీల అగ్రనేతలు చంద్రబాబు, కిషన్‌రెడ్డి ఒకేరోజు జిల్లాలో పర్యటించి ఎవరికి వారే బహిరంగ సభలు నిర్వహించారు.
     
     దీంతో మోడీ హవా రాథోడ్‌కు కలిసిరాకుండా పోయింది. పైగా తెలంగాణవాదం బలంగా పనిచేస్తున్న ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై బరిలో నిలవడం ఆయన గెలుపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబు జపం చేయడం, ఆయనతో జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించడం వంటి చర్యలతో తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతోంది. టీడీపీ పోటీ చేస్తున్న ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిర్పూర్‌లో ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రావి శ్రీనివాస్ నాలుగో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. ఖానాపూర్ అభ్యర్థి రాథోడ్ రితేష్ ప్రత్యార్థులకు పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్నారు. బెల్లంపల్లి అభ్యర్థి పాటి సుభద్ర, నిర్మల్ అభ్యర్థి బాబర్‌బేగ్‌ల పరిస్థితి కూడా ఇంతేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆసిఫాబాద్ అభ్యర్థి మర్సకోల సరస్వతీ మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క బోథ్‌లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు కొంత మెరుగనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
     
     అభ్యర్థులకు హ్యాండిచ్చారు..
     జిల్లాలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితిని గ్రహించి.. ఆ పార్టీకి అన్ని తానై చక్రం తిప్పుతున్న నేతకు ‘బాధ్యతలు’ అప్పగించారు. ఆయన అభ్యర్థులకు హ్యాండిచ్చారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అభ్యర్థుల కోసం వచ్చినదాన్నంత ఈ నేత వెనకేసుకోవడం ఆ పార్టీ అభ్యర్థులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఇదిగో ఇస్తా.. అదిగో ఇస్తా అంటూ వారం రోజులుగా నెట్టుకొచ్చారు. తీరా కీలక సమయంలో అభ్యర్థులకు మొండిచేయి చూపడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో జిల్లాలో ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు.
     
     వాడిన కమలం
     టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీకి జిల్లాలో కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన క్రెడిట్ ఉన్నప్పటికీ టీడీపీతో కలువడం కారణంగా జిల్లాలో ఏ ఒక్క సీటును కూడా గెలుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కానీ ఎక్కడా బీజేపీ అభ్యర్థుల గెలుపు దరిదాపుల్లో కనిపించడం లేదు. చెన్నూరులో రాంవేణు, మంచిర్యాలలో మల్లారెడ్డిలు మూడో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. భైంసా, ఆదిలాబాద్‌లలో పోటీ చేస్తున్న రమాదేవి, పాయల్ శంకర్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement