వలస నేతలు.. విలవిల
- టీజీవీకి ముస్లింలు రాంరాం
- ఏరాసు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత
- నంద్యాలలో ఓటమి అంచున శిల్పా
- నందికొట్కూరులో లబ్బికి ఎదురుగాలి
- కండువాలు మార్చినా.. ఓటర్లను ఏమార్చలేని వైనం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఆ నలుగురు నేతలను రాష్ట్ర విభజన పాపం వెంటాడుతోంది. కండువాలు మార్చుకున్నా వజ్రాయుధమైన ఓటు నుంచి తప్పించుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను చేపట్టి.. అన్నదమ్ముల్లాంటి తెలుగు ప్రజలను చీల్చొద్దని నెత్తినోరు కొట్టుకున్నా పెడచెవిన పెట్టారు. అధికార దాహంతో తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. విభజనానంతరం కాంగ్రెస్‌ను ప్రజలు చీకొట్టడంతో.. గుడ్డికన్నా మెల్ల నయం అన్నట్లు మంత్రులుగా పనిచేసిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిలు టీడీపీలో చేరిపోయారు. పార్టీ అయితే మారారు కానీ.. ప్రజల ఆగ్రహజ్వాలల నుంచి తప్పించుకునే దారి లేక ఓటమి అంచున కొట్టుమిట్టాడుతున్నారు.
ఇక ‘పచ్చ’ పార్టీ అధినేత చంద్రబాబు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలిసిందే. పైగా నరేంద్రమోడీ గొప్ప నాయకుడని బాబు పొగడ్తలతో ముంచెత్తడం ముస్లిం ఓటర్లలో వ్యతిరేకతను పెంచుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మైత్రి టీడీపీ అభ్యర్థుల ఓటమి కారణమవుతోంది. పైగా వలస నేతలైన ఈ నలుగురికి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం కూడా గెలుపు ఆశలను గల్లంతు చేస్తోంది.
కర్నూలులో టీడీపీకి ముస్లింలు రాంరాం
మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పట్ల కర్నూలు ముస్లింలలో వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తుపెట్టుకోవటం టీడీపీకి గడ్డు పరిస్థితులను తీసుకొచ్చింది. జయాపజయాలను శాసించే ముస్లిం ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తుండటం.. వారి మధ్యే వర్గ విభేదాలు సృష్టించటం ఆ సామాజిక వర్గంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. అదేవిధంగా తన ఆల్కలీస్ పారిశ్రామికవాడ నుంచి వెదజల్లే కాలుష్యంతో ఇటీవల కాలంలో కర్నూలు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యారు. ఓ వృద్ధురాలు మరణించారనే ప్రచారం కూడా ఉంది. ఇవి చాలవన్నట్లు టీజీపై 420 కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయినట్లు ప్రచారం జరగడంతో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం గమనార్హం. మొత్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత నడుమ ఆయన గట్టెక్కడం కష్టమేనని తెలుస్తోంది.
నంద్యాలలో శిల్పాకు ఎదురుగాలి
నంద్యాల పేరు చెబితే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తారు. నందుల కోటలో ఆయన పట్ల అంతటి అభిమానం ఉంది. రాజకీయ భిక్షపెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా నిలవక ఆయన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున బరిలో నిలిచిన భూమా నాగిరెడ్డి ప్రజాదరణతో ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఆయనను ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కడం ఆయనను ఓటమికి చేరువ చేస్తోంది. మార్పును కోరుకుంటున్న ఇక్కడి ప్రజలు ఈ విడత వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
ఏరాసును పట్టించుకోని పాణ్యం జనం
శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏరాసు ప్రతాప్‌రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించిన ఆయన టీడీపీలో చేరి పాణ్యం బరిలో నిలిచారు. మూడేళ్లు అధికారం కట్టబెట్టినా ఏమీ చేయలేని ఆయన ఇక్కడ అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రచారం సందర్భంగా ఆ వ్యతిరేకత బయటపడుతోంది. బొల్లవరంలో ఇటీవల ప్రచారానికి వెళ్లగా ‘‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా.. చంద్రబాబు అయితే బాగుంటుందా’’ అని ఆయన పదేపదే జనం స్పందన కోరగా.. ప్రజలు ‘వైఎస్ జగన్ సీఎం అయితేనే బాగుంటుంది’’ అని చెప్పడం విశేషం.
నందికొట్కూరులో లబ్బి గూండాగిరి
ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన లబ్బి వెంకటస్వామికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డే. అలాంటి కుటుంబాన్ని కాదని ప్రత్యర్థులతో చేతులు కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై అనుచరులచే దౌర్జన్యాలకు దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బుధవారం ఓ విద్యార్థిపై తమ్ముళ్లు చేయి చేసుకోవడమే తాజా నిదర్శనం. అదేవిధంగా చిరకాల ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న బెరైడ్డి వర్గం, లబ్బి వర్గం ఏకమై ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటాన్ని చూసి స్థానికులు ముక్కన వేలేసుకుంటున్నారు. ఆయన హయాంలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించడం పట్ల కూడా ప్రజలు గుర్రుగా ఉన్నారు.