వైసీపీ శ్రేణులపై దాడి
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. స్థానిక 18వ వార్డులో జరిగిన ఈ ఘటనలో పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్‌తో పాటు మరో కార్యకర్త బం టుమిల్లి శివ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం 18వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థినిగా పోటీచేసి ఓటమి బాధతో కోడే విజయలక్ష్మి, ఆమె భర్త, పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ తన నివాసంలో ఉన్నారు. అయితే ఆ వార్డులో విజయం సాధించామనే గర్వంతో టీడీపీ అభ్యర్థినితో పాటు కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డప్పులతో ఊరేగింపు నిర్వహించి వైఎస్సార్ సీపీ శ్రేణులపై కవ్వింపులకు దిగారు.
దీనిపై కోడే యుగంధర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసి టీడీపీ నాయకుడు మల్లిపూడి శివప్రసాద్, ఉండి మారెమ్మ, కొండ తదితరులు యుగంధర్, అతని భార్య విజయలక్ష్మి, బంటుమిల్లి శివ, వర్ధినీడి సత్యనారాయణ, శ్రీధర్, ప్రవీణ్, రాము, రేవంత్ తదితరులపై దాడికి దిగారు. ఈ ఘటనలోయుంగంధర్‌కు, శివకు తీవ్ర గాయలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే యుగంధర్ తదితరులు తమపై దౌర్జన్యం చేశారని మారెమ్మ తదితరులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు.