జాబితాకు తుదిరూపు ! | Telangana congress candidates to be elected today | Sakshi
Sakshi News home page

జాబితాకు తుదిరూపు !

Published Wed, Mar 26 2014 4:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Telangana congress candidates to be elected today

నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ   
తెలంగాణ అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై కసరత్తు
 సీపీఐ, టీఆర్‌ఎల్డీలతో పొత్తుపైనా తుది నిర్ణయం
 28న తొలిజాబితా విడుదల చేసే అవకాశం
 నేడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ ఢిల్లీకి

 
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలోని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం భేటీ కానుంది. తెలంగాణ నుంచి పార్టీ తరపున లోక్‌సభకు, అసెంబ్లీకి పోటీచేయనున్న అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇవ్వనుంది. సీనియర్ నేత వయలార్ రవి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ సీఈసీకి నివేదిక సమర్పించింది. మెజారిటీ స్థానాల్లో ఒకే అభ్యర్థిని, గరిష్టంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఈ నివేదికలో ప్రతి పాదించారు. తాజాగా సీపీఐ, టీఆర్‌ఎల్డీలతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడడంతో.. ఆ పార్టీలు అడుగుతున్న సీట్ల వివరాలను కూడా పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 26న సీఈసీ భేటీ తరువాత 28న తొలి జాబితా విడుదల చేస్తామని దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2న తెలంగాణలోని స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆలోపే తెలంగాణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి జాబితాలు విడుదల చేయాలని అధిష్టానం భావిస్తోంది.
 
 టీఆర్‌ఎల్డీ పొత్తుపై దిగ్విజయ్‌తో ఎమ్మెల్సీ దిలీప్ భేటీ..
 కాంగ్రెస్‌తో పొత్తు విషయమై టీఆర్‌ఎల్డీ నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మంగళవారం భోపాల్ వెళ్లి దిగ్విజయ్‌సింగ్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 6అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని తమకు కేటాయిం చాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది.
 నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల: సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోకతప్పని పరిస్థితులున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేయనుంది. మధ్యతరగతి, పేదలు, నిరుద్యోగ యువత లక్ష్యంగా సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, ఉపాధి కల్పన వంటి హామీలను మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు సమాచారం.
 
 ఢిల్లీ చేరుకున్న పొన్నాల..
 సాక్షి, హైదరాబాద్: పొత్తులపై జరిగిన చర్చల సారాంశాన్ని అధిష్టానానికి వెల్లడించేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.  సీపీఐ, టీఆర్‌ఎల్డీలతో పొత్తు, కాంగ్రెస్ అభ్యర్థుల ఖ రారుపై చర్చించేందుకు అధిష్టానం పెద్దలు పొన్నాలను ఢిల్లీకి పిలిపించారు. బుధ, గురువారాల్లో కూడా వారు హస్తినలో మకాం వేసి.. దిగ్విజయ్‌సింగ్, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో భేటీకానున్నారు.  అపాయిం ట్‌మెంట్ లభిస్తే సోనియా, రాహుల్‌లతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి, బహిరంగ సభల తేదీల ఖరారుపై చర్చించాలని పొన్నాల భావిస్తున్నారు.మరోవైపు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement