assembly candidates list
-
హామీలు లేవు బుజ్జగింపులే
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు, అసమ్మతులు మొదలయ్యాయి. జాబితా వెల్లడించి నెల రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటన తో టికెట్ ఆశించిన కొందరికి ఆశాభంగం కలిగింది. వీరిలో కొందరు ఏకంగా సొంతంగా ప్రచారం మొదలుపెట్టారు. మరికొందరు అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని ఇంకొందరు పట్టుపడుతున్నారు. ఇలా టీఆర్ఎస్లో నెలకొన్న అసమ్మతి, అసంతృప్త నేతలను అను నయించే బాధ్యతలను సీఎం కేసీఆర్ పూర్తిగా మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్ ప్రతి రోజూ పలు నియోజకవర్గాల వారీగా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు సత్యవతి రాథోడ్ (డోర్నకల్), మాలోతు కవిత (మహబూబాబాద్), తక్కళ్లపల్లి రవీందర్రావు (పాలకుర్తి)లను కేటీఆర్ తన క్యాంపు కార్యాలయానికి పిలిచి వేర్వేరుగా మాట్లాడారు. అవకాశాల విషయంలో అన్యాయం జరిగిందని ముగ్గురు నేతలు కేటీఆర్‌కు వివరించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వపరంగా, పార్టీలో, నియోజకవర్గాల్లో తమ విషయంలో జరిగిన సంఘటనలను వివరించారు. గెలుపు అవకాశాలు ఉన్న వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. అన్ని విషయాలను సావధానంగా ఆలకించిన మంత్రి కేటీఆర్.. ‘మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. అనివార్య పరిస్థితుల్లోనే మీకు టికెట్ ఇవ్వలేకపోయాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు అనే విధానంతో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లలో మీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదనే విషయం వాస్తవమే. మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కేసీఆర్ గారితో మాట్లాడతా. రెండు రోజుల్లో మళ్లీ విషయం తెలియజేస్తా. అందుబాటులో ఉండండి. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలి’ అని కోరారు. కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్మేలు.. చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య నియోజకవర్గంలోని అసంతృప్త నేతలను తీసుకుని వచ్చి కేటీఆర్‌ను కలిశారు. అందరూ కలిసి పని చేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ వారికి సూచించారు. మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కేటీఆర్‌ను కలిశారు. మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడిన మట్టా దయానంద్ సైతం కేటీఆర్‌ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలి సి వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేకపో యామని, భవిష్యత్‌లో అవకాశాలుంటాయని దయా నంద్‌కు కేటీఆర్ సూచించారు. అవకాశాల విషయం లో స్పష్టమైన హామీ లేకపోవడంతో దయానంద్ అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో స్థానికత నినాదంతో ఆయన సొంతంగా ప్రచారం చేస్తున్నా రు. దీన్ని కొనసాగిస్తారా? టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మళ్లీ కలిసిన కడియం.. స్టేషన్ ఘన్‌పూర్‌లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని స్పష్టత ఇచ్చినా అక్కడి అసంతృప్తులు తొలిగే పరిస్థితి ఉండటం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి టి.రాజయ్యను మార్చడం కుదరదని కేటీఆర్ ఆ నియోజకవర్గ నేతలకు సోమవారం స్పష్టం చేశారు. అభ్యర్థిని మార్చకుంటే కుదరదని, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్టేషన్ ఘన్పూర్ అసంతృప్త నేతలు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సైతం కేటీఆర్‌ను కలిశారు. అనంతరం వరంగల్‌లోని అసంతృప్త నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటనను కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
కర్ణాటక కాంగ్రెస్ తొలి జాబితా ఆలస్యం
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా అభ్యర్ధుల తొలి జాబితా ఆలస్యం కానుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం 180 మంది అభ్యర్ధులతో తొలి జాబితా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ రెండు సార్లు సమావేశమైనప్పటికీ అభ్యర్ధుల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదనీ, శనివారం మరోసారి సమావేశం కానున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. పార్టీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు తమ సొంత జాబితా తయారు చేసుకుని రావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన జేడీ(ఎస్), బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటంపై కొందరు నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం. సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర, కొందరు సీనియర్ మంత్రుల కుటుంబీకులకు టికెట్లు ఇవ్వటంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
జాబితాకు తుదిరూపు !
నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ తెలంగాణ అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై కసరత్తు సీపీఐ, టీఆర్‌ఎల్డీలతో పొత్తుపైనా తుది నిర్ణయం 28న తొలిజాబితా విడుదల చేసే అవకాశం నేడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ ఢిల్లీకి సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలోని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం భేటీ కానుంది. తెలంగాణ నుంచి పార్టీ తరపున లోక్‌సభకు, అసెంబ్లీకి పోటీచేయనున్న అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇవ్వనుంది. సీనియర్ నేత వయలార్ రవి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ సీఈసీకి నివేదిక సమర్పించింది. మెజారిటీ స్థానాల్లో ఒకే అభ్యర్థిని, గరిష్టంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఈ నివేదికలో ప్రతి పాదించారు. తాజాగా సీపీఐ, టీఆర్‌ఎల్డీలతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడడంతో.. ఆ పార్టీలు అడుగుతున్న సీట్ల వివరాలను కూడా పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 26న సీఈసీ భేటీ తరువాత 28న తొలి జాబితా విడుదల చేస్తామని దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2న తెలంగాణలోని స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆలోపే తెలంగాణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి జాబితాలు విడుదల చేయాలని అధిష్టానం భావిస్తోంది. టీఆర్ఎల్డీ పొత్తుపై దిగ్విజయ్‌తో ఎమ్మెల్సీ దిలీప్ భేటీ.. కాంగ్రెస్‌తో పొత్తు విషయమై టీఆర్ఎల్డీ నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మంగళవారం భోపాల్ వెళ్లి దిగ్విజయ్‌సింగ్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 6అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని తమకు కేటాయిం చాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల: సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోకతప్పని పరిస్థితులున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేయనుంది. మధ్యతరగతి, పేదలు, నిరుద్యోగ యువత లక్ష్యంగా సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, ఉపాధి కల్పన వంటి హామీలను మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు సమాచారం. ఢిల్లీ చేరుకున్న పొన్నాల.. సాక్షి, హైదరాబాద్: పొత్తులపై జరిగిన చర్చల సారాంశాన్ని అధిష్టానానికి వెల్లడించేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సీపీఐ, టీఆర్‌ఎల్డీలతో పొత్తు, కాంగ్రెస్ అభ్యర్థుల ఖ రారుపై చర్చించేందుకు అధిష్టానం పెద్దలు పొన్నాలను ఢిల్లీకి పిలిపించారు. బుధ, గురువారాల్లో కూడా వారు హస్తినలో మకాం వేసి.. దిగ్విజయ్‌సింగ్, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో భేటీకానున్నారు. అపాయిం ట్మెంట్ లభిస్తే సోనియా, రాహుల్‌లతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి, బహిరంగ సభల తేదీల ఖరారుపై చర్చించాలని పొన్నాల భావిస్తున్నారు.మరోవైపు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.