తెలంగాణ ఉద్యోగ సంఘాలతో టీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్య
ఆప్షన్లు, భవనాల కేటాయింపుపై చర్చ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హంగ్ ఫలితాలొచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు మంగళవారమిక్కడ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, మధుసూదన్‌రెడ్డి, రఘు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. విభజన నేపథ్యంలో ఉద్యోగుల ఆప్షన్లు, ప్రభుత్వ కార్యాలయాల కేటాయింపుపై ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే. ఇప్పటివరకు మీరు బాగానే సహకరించారు.
ఇకపైనా సహకరించండి. మీ సమస్యలేంటో చెప్పండి..’ అని కాంగ్రెస్ నేతలు అడిగారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను కేటాయించాలని, ఆప్షన్లు వద్దని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలన్నీ వేర్వేరు భవనాల్లోనే కొనసాగించాలని, సీమాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో తాత్కాలికంగానే కొనసాగనున్నందున దానికి అద్దె భవనాలు కేటాయించాలన్నారు. ఉద్యోగుల కేటాయింపులో ఐదు వేల మంది విషయంలోనే సమస్యలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
రైతులను ఆదుకోండి: గవర్నర్‌కు పొన్నాల వినతి
పొన్నాల లక్ష్మయ్య మంగళవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.