బంగారు తెలంగాణ మాతోనే సాధ్యం
దుబ్బాక, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ మాతోనే సాధ్యమని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నానని, ఇదే గడ్డపై పుట్టిన బిడ్డగా.. ఇక్కడ చదువుకున్న విద్యార్థిగా చెబుతున్నా.. బంగారు తెలంగాణను సాధించి తీరుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం మల్లాయపల్లి రోడ్డులో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కేసీఆర్ హాజరై ప్రసంగించారు.
ఉద్యమాల వల్ల దుబ్బాక అభివృద్ధిలో వెనుకబడిన మాట వాస్తవమే అయినా.. ఇక తెలంగాణ వచ్చినందున పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, అందుకు తనతోపాటు, రామలింగారెడ్డిని గెలిపించాలని కోరారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రామలింగారెడ్డి జర్నలిస్టుగా ఉండి అనేక సమస్యలపై పోరాడారన్నారు. సీట్ల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉందని, సోదరుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇక్కడ సీటు కోసం ప్రయత్నించారని, కొన్ని పరిస్థితుల కారణంగా అతడికి అవకాశం కల్పించలేకపోయామన్నారు. ప్రభాకర్‌రెడ్డికి ఎమ్మెల్యేకు మించిన హోదా కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. రామలింగారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి అనుచరులందరూ కలిసి పనిచేసి టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అంతా దుబ్బాక చలవే..
దుబ్బాకతో తనకున్న అనుబంధం మరిచిపోలేనిదని కేసీఆర్ అన్నారు. దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే ఐదేళ్లు చదువుకున్నానని తెలిపారు. ఇంత చక్కగా తెలుగులో మాట్లాతున్నానంటే ఇందుకు దుబ్బాకలో ఉపాధ్యాయులు నేర్పిన విద్యనే.. వారి ఆశీర్వచనమేనని గుర్తుచేశారు.
సిద్దిపేట తరహా దుబ్బాకలో కూడా మంచినీటి పథకం ఏర్పాటుచేసి, రెండేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. సిద్దిపేటలో అమలుచేసి చూపించానని, ఈ నియోజకవర్గంలో కూడా అమలు చేసి చూపిస్తానన్నారు. దుబ్బాకలో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వేసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సాగునీటి బాధలు పోవాలంటే ఈ ప్రాంతానికి ప్రాజెక్టు నీరు అవసరమన్నారు.
తాను చిన్నగా ఉన్నప్పటి నుంచి పాలకులు ఈ ప్రాంతానికి శ్రీరాంసాగర్, పోచంపాడు సాగర్‌ల నుంచి నీరు వస్తుందని చెబుతున్నా నేటికీ రాలేదన్నారు. ఆంద్రోళ్ల పాలనలో కన్నీళ్లు తప్ప నీళ్లు రాలేదన్నారు. మిడ్ మానేరు డ్యాం నుంచి సిద్దిపేటకు సాగునీరు వస్తోందన్నారు. ఈ క్రమంలో తడ్కపల్లి వద్ద 30 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణమవుతోందన్నారు. అక్కడి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో 150 వేల ఎకరాల నుంచి 180 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
ఆ పథకం రూపకల్పన అయిందన్నారు. నేను పుట్టిన గడ్డ.. చదువుకున్న ప్రాంతం కనుక రెండున్నరేళ్లలో కాల్వల ద్వారా సాగునీరు అందించే బాధ్యత తనదేనంటూ కేసీఆర్ ప్రతిజ్ఞ చేశారు. ఇంకా పలు హామీలు గుప్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులుహరీష్‌రావు, వినోద్‌కుమార్, దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, సిద్దారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.