కె.చంద్రశేఖర రావు
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు(కెసిఆర్) దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలంగాణ భవన్లో ఈ రోజు జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో లెజిస్లేచర్ పార్టీ నేతగా కెసిఆర్ను ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును ఈటెల రాజేంద్ర ప్రతిపాదించారు. అందరూ ఆమోదించారు. శాసనసభ ఎన్నికలలో మొత్తం 119 స్థానాలలో టిఆర్ఎస్ 63 స్థానాలకు గెలుచుకొని పూర్తి మెజార్టీని సాధించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తరువాత ఆ పార్టీ నేతలు ఈటెల రాజేంద్ర, నాయని నరసింహారెడ్డి, కె.కేశవరావులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ నాయకత్వంలో తామంతా తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఆకలి కేకలులేని తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యం అన్నారు. తాము ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేరుస్తామని చెప్పారు. తమ పార్టీ తరపున రేపు గవర్నర్ నరసింహన్ను కలవనున్నట్లు తెలిపారు.