సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల జాతర ముగిసింది. నెలరోజులుగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో కొనసాగిన ఓట్ల పండగకు తెరపడింది. ఏకకాలంలో స్థానిక, సార్వత్రిక పోరు జరగడంతో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. మాసం వ్యవధిలో పురపాలక, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు జరగడం ఓటరు మహాశయులకు వినోదం పంచింది. తాజాగా ఈ ఎన్నికలు ముగియడంతో వీటి ఫలితాలపై ఓటర్లు చర్చోపచర్చలు కొనసాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందనే కారణంతో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపును సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో వరుసగా ఈ మూడింటి ఫలితాలు వెల్లడికానుండడంతో అందరి దృష్టి ఫలితాలపైనే పడింది. ఈనెల 12న మున్సిపాలిటీల, 13న జిల్లా, మండల ప్రాదేశిక, 16న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణ ఎన్నికల సందడిలో నిమగ్నమైన రాజకీయపక్షాలు... ఇప్పుడు ఫలితాల విశ్లేషణపై దృష్టి సారించాయి. స్థానిక పోరుకు తెరపడగానే... జమిలి ఎన్నికల నిర్వహణపై కన్నేసిన పార్టీలు... వాటి విషయాన్ని దాదాపుగా మరిచిపోయాయి. తాజాగా సాధారణ సమరం ముగియడంతో ఈ మూడు ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చ సాగుతోంది. బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కీలకఘట్టం ముగియడంతో జిల్లా యంత్రాంగం కూడా ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించింది.
ఏడు చోట్ల కౌంటింగ్!
జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపును అధికారయంత్రాంగం ఏర్పాట్లను చేస్తోంది. ఏడు చోట్ల స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరచిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లోనే ఈనెల 16న కౌంటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. బౌరంపేటలోని డీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాలు, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉప్పల్, ఎల్‌బీనగర్ , శేరిగూడలోని ఇందూ కాలేజీలో ఇబ్రహీంపట్నం, కొత్తపేటలోని వీఎం హోంలో మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంటు, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల జూనియర్ కాలేజీలో చేవెళ్ల నియోజకవర్గం, వికారాబాద్ మహావీర్ ఆస్పత్రిలో వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ శుక్రవారం పరిశీలించారు. వీటి భద్రతకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసుశాఖను ఆదేశించారు.
ఇదిలావుండగా, 12న జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపునకు రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీల ఓట్ల లెక్కింపును నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో, వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీలకు ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ఓట్లను లెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన ఒకే చోట భద్రపరిచిన ఈవీఎంలను 11వ తేదీన ఆయా కౌంటింగ్ హాళ్లకు తరలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు 13న జిల్లా, మండల ప్రాదేశిక స్థానాల ఓట్ల లెక్కింపునకు కూడా జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఇక రానుంది..ఫలితాల జాతర
Published Fri, May 2 2014 11:47 PM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement