results of the general election
-
లెక్క తేల్చండి
సాక్షి, మంచిర్యాల : సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు నెలరోజులు కావస్తున్నా బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించడం లేదు. ఎన్నికల ఖర్చు వివరాలు అందజేసేందుకు మరో రెండ్రోజులే గడువు ఉన్న నేపథ్యంలో అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఈనెల 16న అభ్యర్థులు సమర్పించిన వివరాలు పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో ఆయా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివరాలు ఎన్నికల అధికారులకు అందజేయాలి. ఎన్నికల ఫలితాలు గత నెల 16న వెలువడిన విషయం తెలిసిందే. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాల పరిశీలకులుగా ఆడిట్, సహకార అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. వీరికి ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వివరాలు అంద జేయాలి. సమర్పించకపోతే అనర్హులే.. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థు లు, ఒక పార్లమెంటు స్థానానికి 8 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. వీరిలో గెలిచి వారితోపాటు ఓడి న వారు వారి ఖర్చుల వివరాలు సమర్పించాలి. వీరి లో 25 మంది మాత్రమే వ్యయ వివరాలు ఇచ్చారు. వి జయం సాధించిన వారిలో ఒక్కరూ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించకపోవడం గమనార్హం. ఎంపీ అభ్యర్థుల్లో కేవలం ఓడిన ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఇప్పటికీ వివరాలు అందించారు. ఎన్నికల ఖర్చు వివరాలు సమర్చించని పక్షంలో వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. ఈ ఖర్చు వివరాలను బరిలో నిలిచిన అభ్యర్థులు లే దా వారి తరఫున ఆధీకృతులైన వారు అందజేయవ చ్చు. అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే వివరాలు అందించడం ఆసక్తికరం. ఓడిపోయిన వారు వివరా లు సమర్పించని పక్షంలో భవిష్యత్తులో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. వాస్తవ ఖర్చుకు.. దస్త్రాల సమర్పణకు పొంతనే లేదు.. ఎన్నికల పోరులో నిలిచిన అభ్యర్థులు చేస్తున్న ఖర్చు కు, ఎన్నికల సంఘం విధించిన పరిమితికి పొంతనలేని పరిస్థితులు వాస్తవంగా నెలకొని ఉన్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎంపీగా పోటీచే సే అభ్యర్థి రూ.70 ల క్షలు, ఎమ్మెల్యేగా బరిలో ఉండే వ్యక్తి రూ.28 లక్షలు ఖర్చు చేయవచ్చు. ఈ ఖర్చులోనే నామినేషన్ మొదలుకొని పోలింగ్ వరకు జరిగిన వ్యయాలను పొందుపర్చాలి. అంటే అభ్యర్థి ప్రచారం, అభ్యర్థులకు మద్దతుగా ఇతరులు పాల్గొనడం, వాహనాలు, జెండాలు, ఇతరత్రా వాటికి వ్యయాల వివరాలు ఇందులో పొందుపర్చాలి. అయితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెజార్టీ అభ్యర్థుల వాస్తవ ఖర్చు కోట్ల రూ పాయల్లోనే ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఎన్నికల అధికారులు నిర్దేశించిన ఖర్చు పరిమితిలోనే ఈ వివరాలను ఎలా పొందుపరచాలని అభ్యర్థులు ఆలోచిస్తుండటం గమనార్హం. 16న పరిశీలకుల రాక అభ్యర్థులు వివరాలు సమర్పించేందుకు కల్పించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈనెల 16న కేంద్ర ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఐఆర్ఎస్ అధికారులు అబ్దుల్హసీం.ఎం, రోహన్‌రాజ్, ఇతర అధికారులు ఆర్.నిరంజన్, అశోక్‌కుమార్‌లు ఈ బృందంలో ఉం టారని తెలిపారు. ఆదాయ వివరాలను సమర్పించని వారి విషయంలో ఉపేక్షించేదిలేదని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. గెలిచిన వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం సైతం ఉందని స్పష్టం చేశారు. -
సార్వత్రిక ఫలితాలపై ఆసక్తి !
తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి పడింది. తాండూరు నియోజకవర్గంలో ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పురపాలక ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు, ప్రాదేశిక ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు నేపథ్యంలో సార్వత్రిక ఫలితాలు ఎలా ఉంటాయనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రెండు ఎన్నికల ఫలితాలు తమకు ఆశాజనకంగా ఉండటంతో ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ సార్వత్రిక ఫలితాలూ తమకు అనుకూలంగానే ఉంటాయనే ధీమాతో ఉంది. స్థానిక సమరంలో పలుచోట్ల టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించకపోవడంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీల శ్రేణులు కలవరపడుతున్నారు. ఈనెల 16న వెలువడనున్న సార్వత్రిక ఫలితాలపై ప్రధాన పార్టీలు బయట ధీమాతో ఉన్నా.. అంతర్గతంగా భయపెడుతున్నాయి. టీడీపీవల్లే తాండూరు మండలంలో జెడ్పీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత తగ్గటానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఫలితాలు టీఆర్ఎస్కు ఈ మండలంలో ఎలా ఉంటాయనేది పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. పెద్దేముల్ ప్రాదేశిక పోరులో కాంగ్రెస్ హవా కొనసాగటంతో ఇక్కడ టీఆర్ఎస్కు ఆధిక్యత వస్తుందా? రాదా? అనేది చర్చనీయాంశంగా మారింది. యాలాల మండలంలో ఆధిక్యతపై టీఆర్ఎస్ భరోసాతో ఉంది. బషీరాబాద్ మండలంలో కూడా ప్రాదేశిక పోరు ఫలితాల నేపథ్యంలో ఇక్కడ తమ పైచేయి ఉంటుందనే ఆశాభావం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినందున సార్వత్రిక పోరు ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా క్రాస్ ఓటింగ్ వ్యవహారం అన్ని పార్టీలను కలవరపెడుతోంది. మొత్తమ్మీద సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి.. ఫలితాలు ఎలా రాబోతున్నాయనేది రాజకీయ వర్గాలతోపాటు నియోజకవర్గ ప్రజల్లోనూ ఆసక్తిగా మారాయి. -
ఇక రానుంది..ఫలితాల జాతర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల జాతర ముగిసింది. నెలరోజులుగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో కొనసాగిన ఓట్ల పండగకు తెరపడింది. ఏకకాలంలో స్థానిక, సార్వత్రిక పోరు జరగడంతో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. మాసం వ్యవధిలో పురపాలక, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు జరగడం ఓటరు మహాశయులకు వినోదం పంచింది. తాజాగా ఈ ఎన్నికలు ముగియడంతో వీటి ఫలితాలపై ఓటర్లు చర్చోపచర్చలు కొనసాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందనే కారణంతో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపును సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో వరుసగా ఈ మూడింటి ఫలితాలు వెల్లడికానుండడంతో అందరి దృష్టి ఫలితాలపైనే పడింది. ఈనెల 12న మున్సిపాలిటీల, 13న జిల్లా, మండల ప్రాదేశిక, 16న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణ ఎన్నికల సందడిలో నిమగ్నమైన రాజకీయపక్షాలు... ఇప్పుడు ఫలితాల విశ్లేషణపై దృష్టి సారించాయి. స్థానిక పోరుకు తెరపడగానే... జమిలి ఎన్నికల నిర్వహణపై కన్నేసిన పార్టీలు... వాటి విషయాన్ని దాదాపుగా మరిచిపోయాయి. తాజాగా సాధారణ సమరం ముగియడంతో ఈ మూడు ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చ సాగుతోంది. బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కీలకఘట్టం ముగియడంతో జిల్లా యంత్రాంగం కూడా ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించింది. ఏడు చోట్ల కౌంటింగ్! జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపును అధికారయంత్రాంగం ఏర్పాట్లను చేస్తోంది. ఏడు చోట్ల స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరచిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లోనే ఈనెల 16న కౌంటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. బౌరంపేటలోని డీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలు, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉప్పల్, ఎల్బీనగర్ , శేరిగూడలోని ఇందూ కాలేజీలో ఇబ్రహీంపట్నం, కొత్తపేటలోని వీఎం హోంలో మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంటు, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల జూనియర్ కాలేజీలో చేవెళ్ల నియోజకవర్గం, వికారాబాద్ మహావీర్ ఆస్పత్రిలో వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ శుక్రవారం పరిశీలించారు. వీటి భద్రతకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసుశాఖను ఆదేశించారు. ఇదిలావుండగా, 12న జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపునకు రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీల ఓట్ల లెక్కింపును నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో, వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీలకు ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ఓట్లను లెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన ఒకే చోట భద్రపరిచిన ఈవీఎంలను 11వ తేదీన ఆయా కౌంటింగ్ హాళ్లకు తరలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు 13న జిల్లా, మండల ప్రాదేశిక స్థానాల ఓట్ల లెక్కింపునకు కూడా జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసుకుంటోంది.