తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి పడింది. తాండూరు నియోజకవర్గంలో ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పురపాలక ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు, ప్రాదేశిక ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు నేపథ్యంలో సార్వత్రిక ఫలితాలు ఎలా ఉంటాయనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రెండు ఎన్నికల ఫలితాలు తమకు ఆశాజనకంగా ఉండటంతో ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్ సార్వత్రిక ఫలితాలూ తమకు అనుకూలంగానే ఉంటాయనే ధీమాతో ఉంది.
స్థానిక సమరంలో పలుచోట్ల టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించకపోవడంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీల శ్రేణులు కలవరపడుతున్నారు. ఈనెల 16న వెలువడనున్న సార్వత్రిక ఫలితాలపై ప్రధాన పార్టీలు బయట ధీమాతో ఉన్నా.. అంతర్గతంగా భయపెడుతున్నాయి.
టీడీపీవల్లే తాండూరు మండలంలో జెడ్పీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆధిక్యత తగ్గటానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఈ మండలంలో ఎలా ఉంటాయనేది పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. పెద్దేముల్ ప్రాదేశిక పోరులో కాంగ్రెస్ హవా కొనసాగటంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత వస్తుందా? రాదా? అనేది చర్చనీయాంశంగా మారింది. యాలాల మండలంలో ఆధిక్యతపై టీఆర్‌ఎస్ భరోసాతో ఉంది.
బషీరాబాద్ మండలంలో కూడా ప్రాదేశిక పోరు ఫలితాల నేపథ్యంలో ఇక్కడ తమ పైచేయి ఉంటుందనే ఆశాభావం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినందున సార్వత్రిక పోరు ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా క్రాస్ ఓటింగ్ వ్యవహారం అన్ని పార్టీలను కలవరపెడుతోంది. మొత్తమ్మీద సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి.. ఫలితాలు ఎలా రాబోతున్నాయనేది రాజకీయ వర్గాలతోపాటు నియోజకవర్గ ప్రజల్లోనూ ఆసక్తిగా మారాయి.
సార్వత్రిక ఫలితాలపై ఆసక్తి !
Published Thu, May 15 2014 12:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement