మల్లగుల్లాలు పడుతున్న టీ కాంగ్రెస్ పెద్దలు
టీఆర్‌ఎస్‌ను మాత్రం అధికారంలోకి రానీయొద్దు..
టీడీపీసహా చిన్న పార్టీలతో మంతనాలు
ఎంఐఎం, సీపీఐలతో చర్చిస్తున్న నేతలు
తెలంగాణలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమెలా? అన్న అంశంపై టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటు కాంగ్రెస్‌కు, అటు టీఆర్‌ఎస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేదని నమ్ముతున్న టీ పీసీసీ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్సే ముందుండేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అతిపెద్ద (సింగిల్ లార్జెస్ట్ పార్టీ)గా అవతరించినా.. తెలుగుదేశం పార్టీతో సహా ఇతర పార్టీలన్నింటినీ కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే మంతనాలు ప్రారంభించారు. తెలంగాణలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని అంచనాలకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు పైకి మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు వస్తాయని చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో కాంగ్రెస్‌కు 40 వరకు సీట్లు వస్తాయని లెక్కలేసి చెబుతున్నారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తో పోలిస్తే నాలుగైదు సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందని కూడా అంగీకరిస్తున్నారు.
వారి లెక్కల ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 45 నుంచి 50 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకుగాను 60 సీట్లు సాధిస్తేనే ఏ పార్టీకైనా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితమైతే టీడీపీ, మజ్లిస్, సీపీఐ, సీపీఎంల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సిద్ధాంతపరంగా బీజేపీతో వైరుధ్యం ఉన్నందున ఆ పార్టీకి దూరంగా ఉండక తప్పదని, అది మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే మజ్లిస్, సీపీఐ నేతలతో టచ్‌లో ఉన్నట్లు టీ పీసీసీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణలోని ఏ ఒక్క పార్టీ న మ్మి మద్దతిచ్చే పరిస్థితి లేదని, ఆయనకు మద్దతిస్తే పొత్తు ధర్మాన్ని పాటించరనే భావన కూడా ఆయా పార్టీల్లో నెలకొందని పేర్కొన్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌కు సర్దుకుపోయే తత్వం ఎక్కువనే విషయం అన్ని పార్టీలకూ తెలుసునని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము ముందుకొస్తే తమకు మద్దతిచ్చే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకైతే మజ్లిస్, సీపీఐ పార్టీలు తమతోనే ఉన్నాయని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వచ్చే సీట్ల ఆధారంగా ఇతర పార్టీలతో నేరుగా మాట్లాడతామని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తమకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఆదుకున్న పార్టీ తెలుగుదేశమేననే సంగతి ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల తరువాత అవసరమైతే మళ్లీ వారి సహాయాన్ని కోరుతాం. వాళ్లు కూడా కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఈ సారి ప్రభుత్వంలో భాగస్వామి కాలేకపోతే తెలంగాణలో తెలుగుదేశం బతికే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి, అధికార పార్టీకి మద్దతివ్వడం తెలుగుదేశం పార్టీకి అవసరం. ఎప్పటికప్పుడు రంగులు మార్చే కేసీఆర్ కంటే సర్దుకుపోయే కాంగ్రెస్సే మేలని చంద్రబాబుకూ తెలుసు..’’అని వ్యాఖ్యానించడం గమనార్హం.
మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం!
Published Mon, May 5 2014 1:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement