
గరసకందాయంలో ‘దేశం’ రాజకీయం
సాక్షి, గుంటూరు :మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గంజి చిరంజీవి ఇంటిపోరుతో సతమతమవుతుంటే, వైఎస్సార్‌సీపీ ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గ్రామాల్లో కలియదిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ఫ్యాన్ స్పీడుతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నామినేషన్ సమయంలోనే దేశం ముఖ్య నేతలు పోతినేని శ్రీనివాసరావు, గంజి చిరంజీవి వర్గాలు గ్రూపులుగా విడిపోయి తన్నులాటకు దిగిన సంగతి తెలిసిందే. వలస వచ్చిన నేతనే అభ్యర్థిగా బాబు ప్రకటించడంపై దేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యులు రాజీనామాల బాట పట్టారు. వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
సోమవారం పలువురు ఆర్కే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదు. ఇదిలాఉంటే గంజి చిరంజీవి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి టీడీపీలో అసలు విభేదాలే లేవని, పత్రికల్లో వచ్చిన కథనాలు కల్పితమని ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు విరుద్ధంగా నియోజకవర్గంలో టీడీపీ కేడర్ వ్యవహారం ఉంది. మొన్నటివరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించిన పోతినేని శ్రీనివాసరావు మొహం చాటేస్తున్నారు. నామినేషన్ వేసి రెండు రోజులు గడిచినా గంజి చిరంజీవి ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటు చిరంజీవి వ్యవహారంపైనా టీడీపీ ముఖ్య నేతలు విస్తుబోతున్నారు. చిరంజీవి తీరు నియోజకవర్గంలో రెండు సామాజిక వర్గాల నడుమ చిచ్చు పెట్టినట్లయిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీలోనే మరో ప్రధాన వర్గానికి చెందిన ఆరుద్ర అంకవరప్రసాద్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
దీంతోపాటు టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ పార్లమెంటు నియోజకవర్గానికి రెబల్ అభ్యర్థిగా రంగంలో దిగడం, తూర్పు నియోజకవర్గం నుంచి రెబల్ అభ్యర్థిగా అల్లాబక్షు నామినేషన్ వేయడంతో జయదేవ్‌లో గుబులు మొదలైంది. ఎలాగోలా ఈ నెల 23లోగా రెబల్ అభ్యర్థుల్ని బరిలో నుంచి తప్పించాలని, లేదంటే ఈ ప్రభావం ప్రచారంపై పడుతుందని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే గడువుండటం, మంగళగిరిలో గ్రూపుల గోల అంతకంతకు పెరగడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పార్టీలోనే ఇన్ని అసంతృప్తులుండటంపై టీడీపీ దింపుడు కల్లం ఆశలకు కళ్లెం పడినట్లేనని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.