సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘నా దగ్గరే కోవర్టులు తయారయ్యారు. చూస్తూ ఉంటే బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి పోయారు. ఎలక్షన్ కదా అని ఎవరికి వారు వారి శక్తికి మించిన కోర్కెలు కోరితే తీర్చాలా. ఒకసారి ఓడిపోయాను. ఇంకోసారి ఓడిపోతే ఏమౌతుంది.’ కావలి టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు పార్టీ మండల, గ్రామ స్థాయి నేతల నుంచి ఎదురవుతున్న డిమాండ్లతో పాటు, పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి పెద్ద ఎత్తున సాగుతున్న వలసలతో తలబొప్పి కట్టి తన నిర్వేదాన్ని ఇలా బయటపెడుతున్నారు. ఇంతకీ ఆయన నిర్వేదానికి కారణమేమంటే...
తెలుగుదేశం పార్టీకి కావలి నియోజకవర్గం తప్పకుండా గెలిచే స్థానమని ఆ పార్టీ జిల్లా నాయకులు, పార్టీ నాయకత్వం కూడా గట్టిగా నమ్ముతూ వచ్చింది. ఎన్నికల హడావుడి ప్రారంభమైన తొలినాళ్లలో ఆ పార్టీ కేడర్, లీడర్లలో కూడా ఇదే ధీమా కనిపిస్తూ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి క్రమంగా సీన్ మారుతూ వచ్చింది. బీద మస్తాన్‌రావు కంచుకోటలైన గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ దూసుకుపోవడం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి లాంటి ముఖ్యులతో పాటు ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చేరికలు ఒక వైపు ఆయనకు గుబులు పుట్టిస్తుంటే, సొంత పార్టీ నుంచే కొందరు తనను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారా అనే భయం ఆవహించినట్లు కావలి టీడీపీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ కొన్ని రోజుల ముందు వరకు బీద మస్తాన్‌రావుకు పెట్టని కోట. టీడీపీతో సంబంధం లేకుండా ఆయన ఈ గ్రామంలో తన సొంత బలం పెంచుకున్నారు. ఏ ఎన్నికల్లో అయినా ఈ పంచాయతీలో దాదాపు 90 శాతం ఓట్లు బీదకు అనుకూలంగా ఓట్లు పడేవి. ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఈ పంచాయతీలో తన పట్టు సడలిందనే విషయం బీద మస్తాన్‌రావు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఆ పంచాయతీలో ఎక్కువ భా గం కేడర్ వైఎస్సార్‌సీపీలో చేరింది.
ఆ మండల టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలోకి వలసలను పసిగట్టి నిలువరించలేక పోయారని బీద ఆ మండల నేతలపై పరోక్షంగా అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తనకు అత్యంత ఆప్తులైన కొం దరి వద్ద ఆఫ్‌ది రికార్డుగా తన బాధను వెళ్లగక్కుతున్నట్లు తెలిసింది. అల్లూరు మండలానికి చెందిన పార్టీ నాయకులు కొందరు ఎన్నికల ప్యాకేజీల విషయమై ఇటీవల మస్తాన్‌రావు మీద ఒత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంలోనే మస్తాన్‌రావు గతంలో ఒకసారి ఓడాను.. మరొకసారి ఓడుతానేమో.. అయినా ఏమవుతుంది అంటూ వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కావలి పట్టణంలో పార్టీ పరిస్థితిపై బీద మస్తాన్ ఆందోళన చెందుతున్నారు.
ఆదాల ఓట్లపై అనుమానం
అల్లూరు మండలానికి చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు పడే ఓట్లు తనకు పడుతాయా, క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే అనుమానం బీదలో నెలకొన్నట్లు తెలిసింది. ఆదాల వర్గీయుల ప్రవర్తనపై బీద విచారణ చేయిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఆదాల వర్గీయులు ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా బీద తన సొంత అనుచరులను పంపి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
కోవర్టుల భయం
పార్టీ కార్యక్రమాల్లో బీద మస్తాన్‌రావు మాట్లాడే సమయంలో ఎవరిదైనా ఫోన్ మోగితే వెంటనే ప్రసంగాన్ని ఆపేస్తుండడం కనిపిస్తోంది. తన మాటలను కొంతమంది పక్క పార్టీ నేతలకు చేరవేస్తున్నట్లు బీదలో అనుమానం నెల కొంది. ఇటీవల టీడీపీలో చేరిన కచ్చేరిమిట్టకు చెందిన ఓ నాయకుడిపై అనుమానం రావడంతో ఆయన ప్రవర్తనపై దృష్టి పెట్టమని బీద తన అనుచరులకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. కోవర్టులు ఎంతో మంది ఉన్నారని, దీంతో అల్లూరు మండలంలో తాను ఎంతో నష్టపోవాల్సి వచ్చిందని, కోవర్టులను గుర్తించాలని కోరుతున్నట్టు సమాచారం.
నేతల అసహనం
బీద మస్తాన్‌రావు ప్రవర్తనపై స్థానిక నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కావలిరూరల్‌కు చెందిన ఓ ముఖ్య నేత అయితే బీద ప్రవర్తన తనను అవమానించేలా ఉందని పలువురు నేతల వద్ద వాపోయినట్లు ప్రచా రం జరుగుతోంది. కావలికి చెందిన ఓ నేత అయితే ఎమ్మెల్యేగా ఉండగా బీద సక్రమంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నట్టు సమాచారం. ఆయన ఎప్పు డు ఎలా ఉంటారో చూసుకుని మాట్లాడాలని ఆ నాయకుడు చోటా నేతలు, కార్యకర్తలకు చెబుతున్నట్లు తెలిసింది.
నిర్వేదంలో బీద
Published Thu, May 1 2014 3:14 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement