
క్లైమాక్స్ అదిరింది
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాలన్న నిబంధనతో ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. అయితే ఆఖరి రోజున ప్రధానపార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌గణేష్, సినీదర్శకుడు పూరి జగన్నాథ్, సినీ హీరో సాయిరామ్‌శంకర్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ భారీ బైక్‌ర్యాలీ హోరెత్తిపోయింది.
నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తల పట్టణం జనసంద్రంగా మారింది. కాగా పోలింగ్‌కు కేవలం ఒక రోజు మాత్రమే గడువుండటంతో తెరవెనుక మంత్రాంగం ప్రారంభమైంది. ప్రలోభాలకు తెర లేచింది. ఇప్పటి వరకు రోడ్ల మీదకు వచ్చి ఓట్లు అభ్యర్థించిన వారు ఇప్పుడు శిబిరాల నిర్వహణలో నిమగ్నమయ్యారు. కులసంఘాలు, మహిళా సంఘాలు, గ్రామ పెద్దలను ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.
వైఎస్‌ఆర్ సీపీ ధీమా
ఈ ఎన్నికల్లో విజయంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సతీమణి, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వై.ఎస్.విజయలక్ష్మి విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో జిల్లా అంతటా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించడం, ఆయన సోదరి షర్మిలమ్మ వరుస పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో జిల్లాలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
అన్నివర్గాల వ్యతిరేక విధానాలను అవలంభించిన తెలుగుదేశం తొమ్మిదేళ్ల పాలన ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలోకి తీసుకోవడం.. ఇప్పటికీ చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ వైఎస్‌ఆర్‌సీసీ అభ్యర్థులకు బలం చేకూరుస్తున్నాయి.
కోట్లు కుమ్మరించిన టీడీపీ
జిల్లాలో ఫ్యాను గాలికి తట్టుకోలేక టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. రూ.కోట్లు వెదజల్లి ఓట్లు కొల్లగొట్టాలని యోచిస్తోంది. దీంతో ప్రతీ నియోజకవర్గంలోను రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చుకు రంగం సిద్ధం చేసుకుని, ఇప్పటికే సగానికి పైగా డబ్బు ఖర్చు చేశారు. ఆదివారం రాత్రి ఒక్కో నియోజకవర్గంలో సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పంచిపెట్టారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో మధురవాడ వాంబే కాలనీలో అర్ధరాత్రి 12 గంటలకు టీడీపీ నాయకులు ఇళ్ల తలుపులు కొట్టి ప్రజలను లేపి మరి ఓటుకు రూ.500 ఇచ్చారు. ఈ పంపకాల కోసం ఒంగోలు నుంచి టీడీపీ బృందం వచ్చినట్లు సమాచారం.