భివండీ నుదుట తెలుగు ‘రాత’ | the key role of telugu people votes in lok sabha elections | Sakshi
Sakshi News home page

భివండీ నుదుట తెలుగు ‘రాత’

Published Thu, Apr 17 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

the key role of telugu people votes in  lok sabha elections

భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలో నివాసముంటున్న వివిధ భాషల ఓటర్లలో తెలుగు ప్రజలే కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల దృష్టి తెలుగు వారి ఓటర్లపైనే ఉంది. ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు తెలుగువారిని ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో కుణబి సమాజ ఓటర్లు 3,15,315 మంది, ఆగ్రి, కోళి కులాల ఓట్లు 2,24,376, ఆదివాసుల ఓట్లు 2,41,302, ముస్లిం వర్గాల ఓట్లు 2,41,302, ఉత్తర భారతీయుల ఓట్లు 94,000, దక్షిణ భారతీయుల ఓట్లు 72,000, మరాఠా సమాజం ఓట్లు 1,69,416, ఇతరుల ఓట్లు 37,000 మొత్తం 13,94,711 ఓట్లు ఉన్నాయి.

అయితే ఈ కులాలకు సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంవల్ల అందులో కొంత శాతం ఓట్లు వారికే పోలయ్యి మిగతావి చీలిపోయే అవకాశముంది. కాని తెలుగు సమాజం నుంచి అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలో లేకపోవడం వల్ల వీరంతా ఎవరికి ఓటువేసినా బంపర్ మెజారిటీతో గెలవడం  ఖాయమని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులందరూ వీరిని దువ్వే ప్రయత్నం చేస్తున్నారు.

 తెలుగు వారి ఓట్లు కీలకం.....
 భివండీ తూర్పు, భివండీ పశ్చిమప్రాంతాల్లో సుమారు 70 వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు అత్యంత కీలకం కావడంతో ప్రధా న పార్టీలైన బీజేపీ, ఎమ్మెన్నెస్ అభ్యర్థులు తెలుగు వారిని తమ వైపు తిప్పుకోవడానికి శాయశక్తులా ‘ప్రయత్నాలు’ చేస్తున్నారు.

 ‘ఆదర్శ’ వ్యక్తి రావాలి
 భివండీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసే నాయకుడు కావాలి, అదేవిధంగా భివండీ నుంచి ముంబై వరకు లోకల్ రైలు, రోడ్డు రవాణా సదుపాయలకు పెద్ద పీట వేయాలి. ముఖ్యంగా టెక్స్‌టైల్ పరిశ్రమల అభివృద్ధి కోసం కృషిచేసే వ్యక్తి కావాలి.

 ఎన్డీయేతోనే అభివృద్ధి
 1999లో వాజ్‌పాయ్ ప్రభుత్వం మరమగ్గాల పరిశ్రమ ఆధునికీకరణకు రూ.25 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. యూపీఏ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు, ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
 - సిరిపురం తిరుపతి (పద్మనగర్)

 ధరలు తగ్గించాలి
 ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెంవేసే నాయకుడు కావాలి. ముఖ్యంగా భివండీలో విద్యుత్ వినియోగదారులను దోచుకుంటున్న టోరంట్ కంపెనీని తరిమికొట్టే సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలి. - పాము మనోహర్-డాక్టర్ (మానససరోవర్)

 పరిశ్రమలను అభివృద్ధి చేయాలి
 భివండీ అభివృద్ది చెందాలంటే రవాణా సదుపాయాలు, పరిశ్రమలు, ఇండస్ట్రీలు, వస్త్రపరిశ్రమ అభివృద్ధి చెందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ఉన్నత విద్యకు పోరాడే నాయకుడు కావాలి.  - కొండాబత్తుల మహేశ్- న్యాయవాది (మార్కండేయ నగర్)

 తెలుగోళ్ల బాగు చూడాలి
 పట్టణంలో మరమగ్గాల పరిశ్రమలో అత్యధికంగా తెలుగు ప్రజలే పనిచేస్తున్నారు.  వారి ప్రయోజనాలు, ఇళ్లు, ఇతర పథకాల కోసం పోరాడే వాడు కావాలి, మరమగ్గాల ఆధునీకరణ, ప్రత్యేక సంక్షేమ పథకాలు, మహిళలకు విద్య, వైద్య, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు కల్పించే నాయకుడు కావాలి. - భిమనాధిని శివప్రసాద్ (పద్మనగర్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement