
మావోయిస్టుల నుంచి ముప్పుంది
ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాం
పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం
రూ. 120 కోట్ల డబ్బు స్వాధీనం
మీట్‌ది ప్రెస్‌లో డీజీపీ బి.ప్రసాదరావు
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు రాష్ర్టంలో మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని రాష్ర్ట డీజీపీ బి. ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను పోలీస్‌శాఖ పరంగా సవాల్‌గా తీసుకుంటున్నామని వివరించారు. మున్సిపల్, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీలతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వరసబెట్టి వచ్చినప్పటికీ ప్రణాళికాబద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జరుగుతున్న ప్రయత్నాలను వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావితమైనవని, ఇక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా సరిహద్దులోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడంతో సమస్యగా మారిందన్నారు. దీంతో సరిహద్దుల్లో నిరంతర సాయుధ పోలీసులతో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామన్నారు. స్పెషల్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసిన మావోయిస్టులు రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేసే ప్రమాదముందని, అందువల్ల ప్రముఖులకు తగిన భద్రత కల్పించామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండడం కూడా పోలీసులకు కొంత కలిసివచ్చిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల పాలన ఉంటే ఎన్నికల సందర్భంగా నాయకుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చేవని, ప్రస్తుతం ఈ ఫిర్యాదులు తక్కువగా ఉన్నాయన్నారు.
60 శాతం డబ్బు వాపస్..
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ. 120 కోట్లను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 60 శాతం డబ్బులను సరైన ఆధారాలు చూపించడంతో సంబంధితులకు అప్పగించామని డీజీపీ ప్రసాదరావు పేర్కొన్నారు. మరో నలభై శాతం డబ్బులను ఇన్‌కం టాక్స్ విభాగానికి అప్పగించామన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద మెరుపుదళాలు
పోలింగ్ కేంద్రాల వద్ద ఎదైనా ఘటన జరిగితే వెంటనే చర్య తీసుకునేందుకు మెరుపుదళాలు, ప్రత్యేక మెరుపుదళాలను ఏర్పాటు చేశామని డీజీపీ వివరించారు. కొన్ని ప్రాంతల్లో ఒకే భవనంలో ఐదు నుంచి పది వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అలాంటి చోట్ల అదనపు భద్రతను ఏర్పాటు చేశామన్నారు.
‘చుండూరు’ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాం
దళితులను ఊచకోత కోసిన సంఘటనకు సంబంధించిన చుండూరు కేసులో నిందితులను నిర్ధోషులుగా తేలుస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అప్పీలు చేస్తున్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు.