హాజరుకానున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
లక్ష మంది సమీకరణ లక్ష్యం సభకు భారీ ఏర్పాట్లు
వరంగల్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ శివారు మడికొండలో ఓరుగల్లు గర్జన పేరిట టీఆర్‌ఎస్ గురువారం బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న సభకు గులాబీ దళం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ దఫా టీఆర్‌ఎస్ ఒంటరిగా అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సభను టీఆర్‌ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
సభ సక్సెస్ చేసి... ఓటర్ల మనసులను దోచుకునే ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణకు ప్రణాళికలు రూపొందించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇదివరకే జనసమీకరణ లక్ష్యం నిర్ధేశించారు. ఇందుకనుగుణంగా మడికొండలోని టీఎన్జీవోలకు చెందిన 40 ఎకరాల గ్రౌండ్‌లో 30 ఎకరాల భూమిని చదును చేశారు. ముళ్లపొదలు తొలగించి సభాస్థలిలో లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు.
సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రాక
సభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్‌లో హన్మకొండకు రానున్నారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా జేఎస్‌ఎం పాఠశాలలో ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... హైటెన్ష్‌న్ తీగల అడ్డంకితో అక్కడికి మార్చారు. కేసీఆర్ ఇక్కడకు చేరుకున్న అనంతరం నేరుగా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లనున్నారు.
అక్కడ కొద్దిసేపు సేద తీరి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ముఖ్య నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు సభాస్థలికి చేరుకోనున్నారు. సభ అనంతరం రాత్రి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సభలో 12 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులతోపాటు రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరుకానున్నారు.
లక్ష మంది లక్ష్యం : రవీందర్‌రావు
గులాబీ గుభాళించేలా... ప్రత్యర్థి పక్షాలను ఆత్మరక్షణలో పడేసేలా సభ నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ లక్ష మంది లక్ష్యంగా జనసమీకరణ చేపట్టామన్నారు.టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయనతోపాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు.
నేడు మడికొండలో ఓరుగల్లు గర్జన
Published Thu, Apr 17 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM
Advertisement