సాక్షి, ముంబై: తొలి దశ ఎన్నికలు జరగనున్న విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఏప్రిల్ పదిన జరిగే ఈ ఎన్నికల్లో 201 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1,21,75,661 మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 62,23,581 మంది పురుషులు, 58,52,041 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పది లోక్‌సభ స్థానాలకు పోటీచేసే 201 మంది అభ్యర్థుల్లో 90 మంది ఇండిపెండెంట్లు, 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. నమోదిత రాజకీయ పార్టీల నుంచి 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఏడు స్థాన్లాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో ఎన్‌సీపీ, ఆరు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో శివసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ వాద్ పార్టీ పది స్థానాల్లో బరిలో ఉండగా, సీపీఐ ఒకే స్థానంలో పోటీ చేస్తోంది. అయితే నాగపూర్‌లో ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ విలాస్ ముత్తెంవార్‌పై పోటీచేస్తున్న బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
అలాగే భండారా, గోండియా నుంచి బరిలో ఉన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, రాంటెక్ నుంచి కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ తమను గెలిపించాలని ప్రజలను ఎన్నికల ప్రచారంలో అభ్యర్థిస్తున్నారు. యావత్మల్-వాషీమ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రాష్ట్ర మంత్రి శివాజీరావ్ మోఘే గెలుపు కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నారు. వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్‌లోనే అందరూ అభ్యర్థులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షులు కేజ్రీవాల్‌తోపాటు పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వివిధ బహిరంగ సభల్లో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తారాస్థాయికి చేరిన ప్రచారం
రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో విదర్భలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి తీవ్రస్థాయికి చేరింది. చివరి రోజైనా మంగళవారం ప్రముఖ నాయకుల ప్రచార సభలు లేకపోయినా, స్థానిక నాయకుల ప్రచారాలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్నాయి. విదర్భలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ కూటమి, మహాకూటమిల మధ్యనే ఉంది. ఒకటి రెండు స్థానాల్లో మాత్రం ఆప్, ఇతర పార్టీలు గట్టి పోటీ ఇవ్వనుండడంతో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నేటితో విదర్భలో ప్రచారానికి తెర
Published Mon, Apr 7 2014 10:30 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement