నేడు సుప్రీంలో తేలనున్న ‘స్థానిక’ భవితవ్యం
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకే దశలోనా..రెండు దశల్లోనా?
నామినేషన్ల ఉపసంహరణకు
నేడు చివరి రోజు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ ఎన్నికలను వాయిదా వేయడానికి విముఖత వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, రెండు దశల్లో నిర్వహించేందుకు అనుమతించాలని ఒక అఫిడవిట్‌లో సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.
అఫిడవిట్ దాఖలు చేసిన మరుసటి రోజు నుంచి హోలీ పండుగ సెలవుల కారణంగా ఈ కేసు ఇన్నాళ్లు విచారణకు రాలేదు. సెలవుల అనంతరం సోమవారం నాడు ఈ కేసు విచారణ జరుగనుంది. ఎన్నికలకు పోలీసు బలగాల తరలింపు కష్టమవుతుందని రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిస్సహాయత వ్యక్తం చేయడంతో రెండు దశల పోలింగ్‌వైపు ఎన్నికల సంఘం మొగ్గుచూపింది.
సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఒకే దశలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు కూడా అదే అఫిడవిట్‌లో ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేసింది. అదే సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినట్టు ఎన్నికల ఫలితాల నిలిపివేతపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించిన విషయం విదితమే.
నేడు నామినేషన్ల ఉపసంహరణ..
ఇదిలాఉండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి సోమవారం చివరి రోజు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ముగియగానే, పోటీలో ఉండే అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. ఏకగ్రీవాలపై కూడా రేపు సాయంత్రానికి స్పష్టత వస్తుంది. 1096 జెడ్పీటీసీ, 16,589 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే..ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కోస్థానానికి సగటున ఏడు నామినేషన్లు దాఖలు కాగా, జెడ్పీటీసీల్లో ఒక్కోస్థానానికి సరాసరి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్టీలకు రెబెల్స్ బెడద..
టికెట్లు ఆశించి ‘బీ’ ఫారాలు అందని నాయకులు రెబెల్స్‌గా రంగంలో ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి. నామినేషన్ల చివరి రోజున వారిని బుజ్జగించి ఉపసంహరించుకునేలా చేయడానికి అన్ని యత్నాలు చేస్తున్నారు.
రెబెల్స్ ఇలాగే కొనసాగితే, రాబోయే అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు తెస్తున్నారు. నామినేషన్ల చివరి రోజున వేల సంఖ్యలో నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.