మహబూబ్‌నగర్‌లో సకుటుంబ సపరివారం...
భార్యభర్తలు: మక్తల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తకోట దయాకర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన భార్య సీతాదయాకర్‌రెడ్డి దేవరకద్ర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా రు. మరోసారి ఆమె అదేపార్టీ నుంచి అదే నియోజకవర్గం నుంచి తలపడుతున్నారు.
అక్కాతమ్ముళ్లు: మాజీ మంత్రి డీకే అరుణ, చిట్టెం రాంమోహన్‌రెడ్డి స్వయానా అక్కాతమ్ముళ్లు. అరుణ గద్వాల నుంచి రాంమోహన్‌రెడ్డి మక్తల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేస్తున్నారు.
అత్తాఅల్లుళ్లు: గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి డీకే అరుణ, అదేస్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(అరుణ భర్త భరతసింహారెడ్డి అక్కకొడుకు) వరుసకు అత్తాఅల్లుళ్లు అవుతారు. వీరిద్దరు ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. పోటీ కూడా హోరాహోరీగా ఉంది.
తండ్రీ కొడుకులు: డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన కొడుకు శశిధర్‌రెడ్డి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి డాక్టర్ మందా జగన్నాథం పోటీచేస్తుండగా, ఆయన కొడుకు మందా శ్రీనాథ్ అలంపూర్ అసెంబ్లీస్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
-న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్